యూనివర్శిటీ క్యాంపస్‌లలో ఇక రాజకీయ నేతల విగ్రహాలు కూడా కనిపించబోతున్నాయి. ముందుగా.. వైఎస్ఆర్ విగ్రహాన్ని.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. ఈ అవకాశం మొట్టమొదటగా.. ఆచార్యా నాగార్జునా యూనివర్శిటీకే దక్కుతోంది. ఆచార్య నాగార్జునుని విగ్రహం.. అసలు ఉందో లేదో కూడా.. ఉన్నట్లుండే.. క్యాంపస్‌లో ప్రధాన భవనం ఎదుట.. ఠీవీగా ఉండే.. వైఎస్ఆర్ విగ్రహాన్ని నెలకొల్పారు. దీన్ని జగన్మోహన్ రెడ్డి ప్రారంభించబోతున్నారని చెబుతున్నారు. గతంలో.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. యూనివర్శిటీలో ఇంజినీరింగ్ కాలేజీకి అనుమతి ఇచ్చారని.. అందుకే.. విగ్రహాన్ని పెడుతున్నామని.. యూనివర్శిటీ అధికారులు చెబుతున్నారు.
విశ్వవిద్యాలయాల్లో రాజకీయాలు చొచ్చుకొస్తున్న సమయంలో.. ఇప్పుడు విగ్రహాలకూ డిమాండ్ పెరుగుతోంది. సాధారణంగా యూనివర్శిటీల్లో విద్యావేత్తలు, స్ఫూర్తి నింపే పరిశోధనలు చేసిన వాళ్లకు ప్రాధాన్యం ఇస్తారు. వారికి కూడా.. విగ్రహాలు పెట్టరు. ఫోటోలు పెడతారు. ఒక వేళ విగ్రహాలు పెట్టాల్సి వస్తే.. మహాత్ముడికి చాన్స్ ఇస్తారేమో కానీ.. రాజకీయ నేతలకు చాన్స్ ఇవ్వరు. కానీ ఇప్పుడు.. యూనివర్శిటీల్లో పదవులు పొందుతున్న వారంతా.. రాజకీయ పార్టీల్లో లాబీయింగ్ చేసుకుని వచ్చినవారే. వారే.. ఆయా రాజకీయ పార్టీలకు కొమ్ముకాస్తూ.. విగ్రహాల ఏర్పాటుకూ అనుమతించేస్తున్నారు.
వైఎస్ విగ్రహాల ఏర్పాటు.. ఒక్క నాగార్జున యూనివర్శిటీతోనే ఆగదని.. అన్ని యూనివర్శిటీల్లోనూ ఏర్పాటు చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే.. ఏఎన్‌యూలో.. విగ్రహం నిర్మాణం పూర్తయింది. ఈ విగ్రహాన్ని చూసి.. విద్యార్థులే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ పార్టీలు కూడా విమర్శలు ప్రారంభించాయి. నారా లోకేష్.. ఈ ఫోటోను ట్వీట్ చేసి.. తీవ్ర విమర్శలు చేశారు.