తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఓట్ల వర్షం కురిపించి పెట్టిన పథకాల్లో ఒకటి.. సామాజిక పెన్షన్లు. వృద్ధులు, ఒంటరి మహిళలు, వికలాంగులు సహా.. వివిధ వర్గాలకు.. రూ. 1000 వరకూ పెన్షన్ ఇచ్చేవారు. ఈ పెన్షన్ వయసు 65 ఏళ్లుగా ఉంది. అరవై ఐదు ఏళ్లు దాటి అర్హులైన వృద్ధులందరికీ.. రూ. 2016 పెన్షన్ ఇస్తామని..కేసీఆర్.. ఎన్నికల హామీగా ఇచ్చారు. ఫలితాలు వచ్చి ఏడునెలలు దాటుతున్నా.. ఇప్పటికీ అమలు చేయలేదు. అయితే.. జూలై నుంచి పెంచిన పెన్షన్లు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు.
పెన్షన్ వయసు తగ్గింపుపై తెలంగాణ సర్కార్ తూచ్..!
సామాజిక పెన్షన్లను ఇచ్చే వయసును.. 65 నుంచి 57కి తగ్గిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఆ మేరకు.. తెలంగాణ ఎన్నికల్లో గెలిచిన వెంటనే… లెక్కలు కూడా బయటకు తీశారు. ఓటరు జాబితాల ఆధారంగానే పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రచారం కూడా జరిగింది. ఈ లోపు… లోక్‌సభ, స్థానిక సంస్థల ఎన్నికలన్నీ ముగిసిపోయాయి. ఇప్పుడు.. పెన్షన్ల అమలుకు.. ప్రభుత్వం జీవో ఇచ్చింది కానీ.. అది నగదు పెంపుకే పరిమితం చేశారు. వయసు పరిమితి తగ్గింపు ప్రస్తావన చేయలేదు. దాంతో.. 57 ఏళ్లు దాటి.. పెన్షన్ వస్తుందని ఆశ పడుతున్న వారికి ప్రభుత్వ నిర్ణయం ఓ రకంగా.. షాక్ లాంటిదే. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చి.. అమలు ప్రారంభించిన మొట్టమొదటి హామీ ఇదే. ఇప్పుడు.. దాన్ని సగం మాత్రమే అమలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 39 లక్షల మంది సామాజిక పెన్షన్లు పొందే వారు ఉన్నారు.
45 ఏళ్లకు పెన్షన్..! చేసి చూపించబోతున్న జగన్..!
వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఎన్నికల ప్రచారం.. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు, చేనేతలకు 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తానని ప్రకటించారు. మిగిలిన వర్గాలకు ఇప్పుడున్న 65 ఏళ్ల వయసు నుంచి 60 ఏళ్లకు తగ్గిస్తానని చెప్పారు. చంద్రబాబునాయుడు.. ఎన్నికలకు ముందు సామాజిక పెన్షన్లను.. రూ. 2వేలకు పెంచడంతో… తాను రూ. మూడు వేలు ఇస్తానని ప్రకటించారు. దాంతో… ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల్లో 45 ఏళ్లు నిండిన వారు.. రూ. 3 వేలు పెన్షన్ పొందనుండగా.. మిగిలిన వర్గాల్లో .. 60 ఏళ్లు పైబడిన వర్గాల వారందరికీ… ఈ పెన్షన్ అందనుంది. జగన్మోహన్ రెడ్డికి ఓట్ల వర్షం కురవడంతో..ఈ పెన్షన్ హామీలు కీలకం కాబట్టి… తొలి నిర్ణయాల్లో.. కచ్చితంగా.. పెన్షన్ పెంపు… ఇతర అంశాలు ఉంటాయన్న భావన వ్యక్తమవుతోంది.
వైఎస్‌ను మించిన సంక్షేమ సారధిగా పేరు ఖాయం..!
వైఎస్ గురించి… ఇప్పటికీ గొప్పగా చెప్పుకుంటున్నారంటే… దానికి ఆయన ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలే కారణం. ఇప్పుడు.. జగన్మోహన్ రెడ్డి.. మళ్లీ ఆయన అడుగుజాడల్లో నడవబోతున్నారు. సామాజిక పెన్షన్లతోనే.. విప్లవం సృష్టించింది.. సంక్షేమ రంగంలో తండ్రిని మించిన ముద్ర వేయబోతున్నారు. ఇది వైసీపీ నేతలను కూడా ఆనందానికి గురి చేస్తోంది.