తప్పుడు పనులు చేసి డబ్బులు సంపాదించే మైండ్ సెట్ ఉన్న వారు ఉన్నత పదవుల్లోకి వస్తే వ్యవస్థ మొత్తానికి అదే రోగం అంటుకుంటుంది. ఏపీలో పట్టపగలు జరుగుతున్న ఇసుక దోపిడీ లాంటివి దీనికి సాక్ష్యాలు. ఇప్పుడు మరో ఘన కార్యం కూడా వెలుగులోకి వచ్చింది. అదే మెడికల్ పీజీ సీట్ల కుంభకోణం. ఏపీలో ఉన్న మెడికల్ కాలేజీలు అదనంగా పీజీ సీట్లకు అనుమతి లేకపోయినా దొంగపత్రాలు సృష్టించి.. మెడికల్ సీట్లను పెంచుకున్నారు. ఇలాంటి పనులు చేయడానికి అర్హతగా వైఎస్ఆర్ పేరు పెట్టేసిన హెల్త్ వర్శిటీ అధికారులు కౌన్సెలింగ్ నిర్వహించేసి సీట్లు భర్తీ చేసేశారు. వినడానికి వింతగా ఉన్నా… ఇది నిజం. ఈ స్కాం బయటపడింది.. ఢిల్లీలో కేసయింది. ఏపీలో మాత్రం… బయటపడినందుకు బాధపడుతున్నారు.
ఇటీవల నంద్యాలకు చెందిన శాంతిరామ్ విద్యా సంస్థల అధినేత శాంతిరాముడు వైసీపీలో చేరారు. రాజమండ్రి జీఎస్ఎల్ మెడికల్ కాలేజీ ఓనర్లు వైసీపీ పెద్దలకు బాగా దగ్గర . ఈ రెండు కాలేజీలు కలిసి తమ కాలేజీల్లో మెడికల్ పీజీ సీట్లు పెరిగాయని భర్తీ చేయాలని వైఎస్ఆర్ హెల్త్ వర్శిటీకి లెటర్లు ఇచ్చారు. నిజంగా ఇండియన్ మెడికల్ కౌన్సిల్ సీట్లు పెంచిందా లేదా అన్నది చూసుకోకుండా హెల్త్ వర్శిటీ సీట్లు భర్తీ చేసేసింది. అసలు పీజీ మెడికల్ సీట్ల కు ఉన్న డిమాండ్ గురించి ఆ రంగంలో ఉన్న వారికి బాగా తెలుసు. వందల కోట్లు చేతులు మారితేనే ఇలా కౌన్సెలింగ్ చేసి ఉంటారన్న ఆరోపణలు వస్తున్నాయి.
ఈ రెండు కాలేజీలు ఫేక్ లెటర్లు పెట్టిన విషయం స్పష్టత రావడంతో మెడికల్ కౌన్సిల్ ఫిర్యాదు మేరకు ఢిల్లీలో కేసయింది. ఇప్పుడీ అంశం ఏపీలో సంచలనం రేపుతోంది. తమకు కాలేజీ వాళ్లు లెటర్లు ఇచ్చారని. ఢిల్లీ నుంచి పోస్టులో వచ్చాయని.. అందుకే కౌన్సెలింగ్ చేశామని హెల్త్ వర్శిటీ వీసీ చెబుతున్నారు. కానీ ఇది ఫేక్ అని ఎంసీఐ చెబుతూ.. ఢిల్లీలో కేసు పెట్టినా ఇక్కడ మాత్రం ఏం చెప్పడం లేదు. ప్రభుత్వం ఏం చెబితే అది చేస్తామంటున్నారు. మొత్తంగా తప్పుడు పనులకు ప్రభుత్వమే వేదిక కావడం… ఫేక్ లెటర్లు.. ఫేక్ అనుమతులకు తెలిసి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో .. ఏపీ గవర్నెన్స్ పై అందరిలోనూ మరోసారి సందేహాలు పెరుగుతున్నాయి.