ఎస్సీ వర్గీకరణను అసెంబ్లీ ఆమోదించింది. అయితే మండలిలో మాత్రం వైసీపీ అడ్డుకుంది. శాసనమండలిలో బిల్లు ప్రవేశ పెట్టడానికి చైర్మన్ మోషన్ రాజు అంగీకరించలేదు. వివిధ కారణాలు చెబుతూ పక్కన పెట్టారు. అయితే శాసనసభలో మాత్రం పాస్ అయింది. దీంతో వర్గీకరణకు ఆర్డినెన్స్ ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది. ఎస్సీ వర్గీకరణకు వైసీపీ అడ్డం పడటం ఆ పార్టీకి మరిన్ని సమస్యలు తెచ్చి పెట్టనుంది. దళిత వర్గంలో జగన్ కు మంచి ఓటు బ్యాంక్ ఉంది. మత మార్పిళ్లు కారణాల వల్ల ఈ ఓటు బ్యాంక్ వచ్చి చేరింది. ఇప్పుడు వారంతా జగన్ తమను ఓటు బ్యాంకుగానే ఉంచుకోవడానికి ఎదగకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం ఉంది.
ఎస్సీ వర్గీకరణ విషయంలో ఏ వర్గానికీ అన్యాయం జరగకుండా చూసేలా ప్రభుత్వం బిల్లు రూపొందించింది. ఏకసభ్య కమిషన్ సిఫారసులను యథాతథంగా ఆమోదించింది. ఈ క్రమంలో ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాని బిల్లును ఆమోదించకుండా అడ్డుకోవడం అనేది రాజకీయంగా వ్యూహాత్మక తప్పిదం అవుతుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత తమ ఓటర్లను కూడా దోచుకుని వైసీపీ ప్రజలకు దూరం అయింది. సొంత వారికి దూరం అయింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అదే ఫార్ములాలో పయనిస్తున్నారు కానీ మారాలన్న ఆలోచనకు మాత్రం రావడం లేదు.
వైసీపీకి అసలు ఓ ప్రణాళిక ఉందో లేదో ఎవరికీ తెలియడం లేదు. అసెంబ్లీకి హాజరు కారు..మండలికి వస్తారు. అక్కడైనా ప్రొడక్టివ్ గా ఉంటుందా అంటే.. ఆ పనీ చేయరు. మాట కంటే ముందు వాకౌట్ చేస్తారు. చివరికి బిల్లుల్ని కూడా ఆపుతున్నారు. ఇలాంటి చర్యల వల్ల వైసీపీకి వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు..కానీ సెల్ఫ్ గోల్ స్పెషలిస్టులుగా తమకు ఉన్న పేరును మాత్రం నిలబెట్టుకుంటున్నారు.