రేషన్ కార్డుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేయాలని ఏపీ సర్కార్ మొదటి కేబినెట్ భేటీలోనే నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత ప్రభుత్వం ప్రచారం చేసింది. సాక్షి మీడియా ఉదరగొట్టింది. వాలంటీర్ల ద్వారా సరఫరా చేసే బియ్యానికి బ్యాగులు కూడా రెడీ చేయించింది. దానిపై.. సన్న బియ్యం అని పెద్ద అక్షరాలతో రాయించింది. కానీ ఇప్పుడు మాత్రం.. మాట మార్చింది. సన్న బియ్యం ఇస్తామని.. ప్రభుత్వం ఎప్పుడూ చెప్పలేదని.. నిర్మొహమాటంగా.. మడమ తిప్పేశారు. ప్రజలకు సన్నబియ్యం ఇస్తామని ప్రభుత్వం ఎప్పుడు చెప్పలేదని, నాణ్యమైన బియ్యం ఇస్తామని మాత్రమే చెప్పిందని పౌరసరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ అధికారికంగా ప్రకటించారు.
మొదట కొన్నాళ్లు హడావుడి చేసిన ప్రభుత్వం.. ఆ తర్వాత .. ఎక్కడా సన్న బియ్యం అనే మాట మాట్లాడటం లేదు. చివరికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా… సన్నబియ్యం అని అనడం లేదు. దానికి పేరు మార్చారు. నాణ్యమైన బియ్యం అంటున్నారు. సంచి మీద సన్న బియ్యం అని ఉంటుంది కానీ… పంపిణీ చేసేది మాత్రం నాణ్యమైన బియ్యమట. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి.. రాష్ట్రం మొత్తం ఈ నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేయడం లేదు. కేవలం శ్రీకాకుళం జిల్లాలో మాత్రమే ప్రారంభిస్తున్నారు. విడతల వారీగా.. ఈ నాణ్యతను.. రాష్ట్ర ప్రజలందరికీ రుచి చూపిస్తారు.
ఇంతకీ ఈ సన్నబియ్యం స్థానంలో.. నాణ్యమైన బియ్యం ఎందుకొచ్చాయి..? మాట మారిందా..? పదం మారిందా..? అనేద సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. సన్నబియ్యం పేరుతో ప్రజలను ఆకట్టుకున్నా ప్రభుత్వం ఇవ్వాలనుకున్నది… రేషన్ బియ్యమే. మిల్లర్ల వద్ద ఎప్పుడూ సేకరించే బియ్యమే. కాకపోతే.. గతంలో నూక శాతం… ఎక్కువ ఉండేది. ఇప్పుడు… అంతకు మించి.. కాస్త నూక శాతాన్ని తగ్గించి… మిల్లర్ల వద్ద తీసుకుంటారు. దాన్నే పంపిణీ చేస్తారు. అంటే.. బియ్యం ఆకారంలో ఎలాంటి మార్పు రాదు. అంటే.. లావుగానే ఉండిపోతుంది. సన్నం కాదు.. చిక్కిపోదు. కానీ అందులో ఉన్న నూక శాతం మాత్రం తగ్గిపోతుంది. అందుకే.. సన్నం నుంచి నాణ్యంగా మారింది. కవర్ చేసుకోవడానికి అసలు సన్నబియ్యం అనే మాటే చెప్పలేదని…అధికార పార్టీ ఎదురు దాడి చేస్తోంది.