ప్రభుత్వానికి అప్పులు ఇవ్వకుండా బ్యాంకుల్ని బ్లాక్ మెయిల్ చేయడం ద్వారా ప్రభుత్వ పథకాలు అమలు కాకుండా వృద్ధులు, ప్రజల్ని టీడీపీ ఇబ్బందులకు గురి చేస్తోందని .. ప్రజల వద్దకు టీడీపీ ఎలా వెళ్తుందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో మూడురోజుల కిందట ప్రశ్నించారు. ఆ తర్వాత నుంచి ఇతర నేతలు కూడా ప్రభుత్వ పథకాల్ని అడ్డుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించడం ప్రారంభించారు. దీంతో టీడీపీ నేతలు ఆర్థిక సమస్యల కారణంగా పథకాల్ని ఆపేయబోతున్నారని..దానికి కారణం టీడీపీ అని చెప్పడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని విమర్శలు ప్రారంభించారు.
ప్రభుత్వం ప్రస్తుతం ఎన్ని అప్పులు చేస్తున్నా ఎన్ని పన్నులు వేస్తున్నా.. పథకాలు అంతరాయం లేకుండా అమలవుతున్నాయలని లబ్దిదారులకు అందుతున్నాయన్న ఓ అభిప్రాయం మాత్రం ఉంది. అందుకే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపించడం లేదని చెబుతున్నారు. ఇలాంటి సమయంలో అదే ఆర్థిక సమస్యలతో పథకాల అమల్లో కాస్త వెనక్కి తగ్గినా.. దానికి టీడీపీనే కారణం అని చెప్పినా ప్రజల్లో వ్యతిరేకత ప్రారంభమవుతుందనే అంచనాలు ఉన్నాయి.
అధికారంలో ఉండి.. చేయలేక టీడీపీ వల్ల అప్పులు పుట్టలేదని చెబితే.. ప్రజలు ఎలా తీసుకుంటారోనన్న ఆందోళన వైసీపీ నేతల్లో ప్రారంభమవుతోంది. కానీ పథకాలు మాత్రం ఆగబోవని వైసీపీ పెద్దలు చెబుతున్నారు. టీడీపీ ఎంతగా అడ్డుకునే ప్రయత్నం చేసినా తాము పథకాలు అమలు చేస్తామనే ప్రకటనలు చేస్తున్నారు. రాబోయే.. రెండు, మూడు నెలల కాలంలో ఏపీలో రాజకీయాలు ఈ పథకాల చుట్టే తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.