రాజకీయాల్లో ప్లాన్లు బెడిసికొడితే పరువు పోతుంది. ఎంతగా సమర్థించుకున్నా… నమ్మేవారుండరు. కుట్ర అంటూ రివర్స్ ఆరోపణలు చేస్తే అందరూ జాలిగా చూసే పరిస్థితి వస్తుంది. ప్రస్తుతం వైసీపీ పరిస్థితి ఇంతే ఉంది. ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు..మైనార్టీలను ఆకట్టుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో బాగంగా “నారా హమారా – టీడీపీ హమారా” నినాదాన్ని మైనార్టీల్లోకి తీసుకెళ్లి సభ నిర్వహించారు. బీజేపీతో సన్నిహితమవతున్నారన్న ప్రచారాన్ని ఖండించలేక … మైనార్టీలను దూరం అయిపోతున్నా.. ఏమీ చేయలేని పరిస్థితిలో పడింది. దీన్ని కవర్ చేసుకోవడానికి… ఓ ఎత్తుగడ వేసింది. అదే.. టీడీపీ మైనార్టీ సదస్సులో తమ కార్యకర్తలను చొప్పించి.. ఆందోళన చేయించి.. తమ మీడియాలో హైలెట్ చేస్తే.. మైనార్టీలు టీడీపీని నమ్మడం లేదని ప్రచారం చేయడం. దానికి తగ్గట్లుగా ప్లాన్ వేసుకున్నారు. అమలు చేశారు. కానీ సాక్ష్యాలతో సహా దొరికిపోయారు.
గుంటూరులో జరిగిన టీడీపీ మైనార్టీ సదస్సులో అలజడి రేపేందుకు .. ప్రయత్నించిన యువకుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరందరూ నంద్యాల వాసులు. సభలో చంద్రబాబు ప్రసంగిస్తూండగా.. సభలో కొంత మంది యువకులు అలజడి రేపారు. గట్టిగా నినాదాలు చేస్తూ పక్కనున్న వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. సభకు వచ్చిన ముస్లిం మహిళలు భయపడే విధంగా.. అరుస్తూ భయానక వాతావరణం సృష్టించేందుకు ప్రయత్నించారు. అయితే వెంటనే గమనించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. విచారణలో పోలీసులుకు.. మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు వెల్లడయ్యాయి. తెలుగుదేశం పార్టీ సభలో.. అలజడి రేపడానికి ప్రయత్నించిన వారంతా.. నంద్యాలకు వైసీపీ కార్యకర్తలు. అంతకు ముందు ఎస్డీపీఐ అనే సంస్థలో సభ్యులుగా ఉండేవారు. వారికి హబీబుల్లా అనే వ్యక్తి నాయకుడిగా వ్యవహరించేవారు. నంద్యాల ఎన్నికల సమయం వీరంతా… శిల్పా చక్రపాణిరెడ్డి నేతృత్వంలో.. వైసీపీలో చేరారు. గుంటూరు మైనార్టీ సదస్సులో అలజడి రేపేందుకు హబీబుల్లా వీరందర్నీ… ఒక రోజు ముందుగానే రైల్లో గుంటూరుకు తీసుకు వచ్చారు. సభలో ఎలా అలజడి రేపాలో సూచనలు చేసి పంపించారు. ఇలా అలజడి రేపిన ఓ యువకుని దగ్గర సెల్ ఫోన్ సమాచారాన్ని పోలీసులు సేకరించారు. అందులో మెసెజుల్లో ఆందోళన చేయమని వేరే వ్యక్తి నుంచి అందుకున్న ఆదేశాలు ఉన్నాయి. హబీబుల్లానే తమను… సభలో అలజడి రేపమని పంపించారని.. వారు పోలీసులు వాంగ్మూలం ఇచ్చారు.
పబ్లిక్ సేఫ్టీకి సంబంధించిన అత్యంత సున్నితమైన విషయం కావడంతో.. పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. అలజడికి ప్రయత్నించిన వారందర్నీ అరెస్ట్ చేశారు. రిమాండ్ కు తరలించారు. ఈ ఘటన వెనుక ఇంకా ఎవరెవరున్నారో విచారణ జరుపుతున్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారంతా.. నిరుపేదలు, పేద కుటుంబాలకు చెందిన వారే. చిరు వ్యాపారాలు చేసుకుంటూ… జీవనం సాగిస్తున్నారు. వీరిలో కొంత మందికి చదువు కూడా రాదు. తాము చెప్పినట్లు చేస్తే.. కేసుల్లో ఇరుక్కున్నా… జగన్ సీఎం అయిన తర్వాత బయటకు తెస్తామని.. పదవులు ఇస్తామని శిల్పా వర్గీయులు యువకుల కుటుంబాలను బతిమాలుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అక్రమ అరెస్టులంటూ.. వైసీపీ నేతలు ఎంత రచ్చ చేసినా.. ప్రత్యర్థి పార్టీ సమావేశంలోకి చొరబడి రచ్చ చేయడమేమిటన్న ప్రశ్న అన్ని వైపుల నుంచి వస్తోంది.