వచ్చే నెల నుండి ప్రారంభం కావలసిన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలను గుంటూరులోని మంగళగిరి వద్ద గల హాయ్ ల్యాండ్ లో కానీ గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని వడ్డేశ్వరం వద్ద గల కె.ఎల్.యు.వర్సిటీలో గానీ నిర్వహించాలని స్పీకర్ డా. కోడెల శివప్రసాద రావు ఆలోచిస్తున్నారు. ఆ రెండూ కాకుండా విజయవాడ, గుంటూరులోని మరికొన్ని ప్రైవేట్ భవన సముదాయలను కూడా ఆయన స్వయంగా పరిశీలించినట్లు తెలుస్తోంది. కానీ అసెంబ్లీ సమావేశాలను ఎక్కడపడితే అక్కడ నిర్వహించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని వైకాపా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేసారు.
“తెదేపా ప్రభుత్వానికి చట్ట సభలు అంటే గౌరవం లేదు. అందుకే అది హోటల్స్ లో ప్రైవేట్ భవనాలలో నిర్వహించాలని ఆలోచిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక నియంతలా వ్యవహరిస్తూ, ప్రభుత్వం అంటే తన స్వంత జాగీరు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ లో పదేళ్ళపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించుకొనే అవకాశం ఉన్నప్పటికీ ఆయన హాయ్ ల్యాండ్ లో ప్రైవేట్ యూనివర్సిటీలలో ఎందుకు నిర్వహించాలనుకొంటున్నారో మాకు తెలియడం లేదు. దానివలన చట్ట సభల గౌరవ ప్రతిష్టలకి భంగం వాటిల్లుతుంది. అంతే కాదు వాటికి అద్దెలు చెల్లించడానికి విలువయిన ప్రజాధనం ఖర్చు చేయవలసి ఉంటుంది. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించమని అడిగితే చేతిలో చిల్లి గవ్వ లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడూ చెపుతుంటారు. కానీ ఇటువంటి తాత్కాలిక తాత్కాలిక పనుల పట్ల మోజు పడుతున్న చంద్రబాబు నాయుడుకి వందల కోట్ల ప్రజాధనం ఇష్టం వచ్చినట్లు విచ్చలవిడిగా ఖర్చుపెట్టేస్తుంటారు. ప్రజాధనం వృధా చేయకుండా చూడాలసిన ముఖ్యమంత్రే ఇలాగ విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేయడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. ప్రైవేట్ హోటల్స్, యూనివర్సిటీలలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామంటే మేము అంగీకరించము. కనుక ఈ ఆలోచనని విరమించుకొని యధాప్రకారం హైదరాబాద్ లో మనకి కేటాయించిన అసెంబ్లీ భవనంలోనే బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని స్పీకర్ కోడెల శివప్రసాద్ కి విజ్ఞప్తి చేస్తున్నాము,” అని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.