మేయర్, మున్సిపల్ చైర్మన్ల ఎన్నికల్లో వైసీపీ అగ్రనాయకత్వం సరికొత్త వ్యూహాన్ని అమలు చేసింది. సొంత పార్టీ నేతలు ఎదగకుండా పక్కా ప్రణాళిక ప్రకారం అమలు చేసింది. పెద్దగా నోరు లేని నేతల్ని చూసుకుని… వారందరికీ పదవులు కేటాయించింది. ఇందులో సిఫార్సులు గట్రా ఏమీ పని చేయలేదు. కొంత మందికి కనీసం ప్రమాణస్వీకారంచేయడం రాలేదు. కొంత మంది మీడియా ముందుకు వచ్చి పాఠాలు అప్పచెప్పడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాదాపుగా ప్రతీ చోటా..ప్రజల్లో పలుకుబడి ఉన్న నేతలు అసంతృప్తికి గురయ్యారు. విశాఖలో అయితే… ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని మేయర్ చేస్తామని చెప్పి.. కార్పొరేటర్‌గా నిలబెట్టి..చివరికి ఆయన్ను కార్పొరేటర్ గానే ఉంచారు. ఆయన కన్నీరుమున్నీరయ్యారు.
వైసీపీ హైకమాండ్… బలమైన నేతలకు కాకుండా… పెద్దగా గుర్తింపు లేని వారికి ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చి పదవులు కేటాయించింది. పార్టీ క్యాడర్లో పలుకుబడి ఉన్న వారు పదవులతో మరింత బలపడతారని..దాని ద్వారా భవిష్యత్‌లో వర్గ పోరాటం పెరిగిపోతుందన్న అంచనాలతో ఇప్పటి నుండే జాగ్రత్త పడినట్లుగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే.. ఎమ్మెల్యే, ఎంపీలు సిఫార్సులు చేసిన వారికి చాలా తక్కువగా పదవులు లభించాయి. తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి తనయుడికి డిప్యూటీ మేయర్ గా చాన్స్ కల్పించలేదు. పార్టీ కోసం కష్టపడిన వారికి ఎక్కువ మందికి చాన్స్ లేకపోవడంతో… వారందరికి మరో డిప్యూటీ మేయర్..మరో డిప్యూటీ చైర్మన్ పదవి ఇస్తామని.. ఆర్డినెన్స్ తీసుకు వస్తున్నామని చెప్పి నేతలు బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు..
తాత్కాలికంగా వైసీపీలో ఎమ్మెల్సీ పదవుల భర్తీ అసంతృప్తి రగిలించినా… పార్టీలో కింది స్థాయిలో ఒకరి మీద ఒకరు పోటీ పడే స్థాయిలో బలమైన నాయకత్వం ఎదగకుండా… తమకు విధేయులుగా ఉండే వారిపై… ఎక్కువ నమ్మకం పెట్టుకుంది. వైసీపీ అధినాయకత్వం వ్యూహాత్మకంగా బలమైన నేతల్ని పక్కన పెట్టి..గ్రూపు తగాదాలు పెరగకుండా చూసుకుందన్న అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. అదే సమయంలో మహిళలకు చాన్సులిచ్చామని.. బడుగు బలహీన వర్గాలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చామని ప్రచారం చేసుకోవడానికి కూడా బాగుంటుందని వైసీపీ వ్యూహం అంటున్నారు.