నంద్యాల ఉప ఎన్నిక ముగిసిన దగ్గర నుంచీ కర్నూలు జిల్లా రాజకీయాలు హాట్ టాపిక్ గానే ఉంటున్నాయి. ప్రస్తుతం వైకాపా ఎంపీ బుట్టా రేణుకతోపాటు, కొంతమంది నేతలు వైకాపాకి దూరం అవుతున్నారు. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లా రాజకీయాలు మరోసారి వార్తల్లో ప్రముఖంగా నిలుస్తున్నాయి. కొద్దిరోజులు కిందట, ఇదే జిల్లాకు చెందిన ప్రముఖ కాంగ్రెస్ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కూడా వార్తల్లో నిలిచారు. ఆయన రాజకీయ కార్యాచరణను మార్చుకుంటున్నారనే ప్రచారం జరిగింది. కాంగ్రెస్ పార్టీని విడిచి, తెలుగుదేశంలో చేరబోతున్నట్టు కథనాలు వచ్చాయి. అయితే, వెంటనే ఆయన వాటిని ఖండించారు. తాను కాంగ్రెస్ పార్టీ విడిచిపెట్టేది లేదనీ, రాజకీయాలు వద్దనుకుంటే వ్యవసాయం చేసుకుంటాననీ, ఇతర పార్టీల్లోకి వెళ్లేది లేదని ఆయన స్పష్టం చేసేశారు. దీంతో ఈ చర్చకు తెర పడిందని అనుకున్నాం. కానీ, ఇప్పుడు ఆయనకి వైకాపా నుంచి ఆహ్వానం అందింది అనే కథనాలు వస్తున్నాయి!
వరుస వలసల నేపథ్యంలో కర్నూలు జిల్లాలో ప్రముఖ నేతలంతా వైకాపా నుంచి బయటకి వెళ్తున్న పరిస్థితి వచ్చింది. ఈ తరుణంలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించాలనేది జగన్ ఆలోచనగా తెలుస్తోంది. కోట్లను పిలిచేందుకు జగన్ సిద్ధంగా ఉన్నారనీ, పార్టీలో ఆయనకు కీలకపాత్ర ఇస్తామనే సంకేతాలు కూడా ఇస్తున్నట్టు సమాచారం. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి దంపతులు వైకాపాలో చేరితే.. కర్నూలు ఎంపీ టిక్కెట్ కోట్లకు, ఆలూరు అసెంబ్లీ సీటు కోట్ల సతీమణి సుజాతమ్మకు ఇచ్చేందుకు సిద్ధం అన్నట్టుగా చెబుతున్నారు. అంతేకాదు, కోట్ల సూచించిన ఇతర నేతలకు కూడా పార్టీలో ప్రాధాన్యత కల్పిస్తాం అనే ఆఫర్ తో జగన్ సిద్ధంగా ఉన్నట్టు ఓ చర్చ జరుగుతోంది.
అయితే, పార్టీ మారేది లేదని కోట్ల స్పష్టం చేసినా… ఆయన అనుచరుల నుంచి ఒత్తిడి పెరుగుతోందనీ, రాజకీయ భవిష్యత్తు కోసం, తనను నమ్ముకున్న ప్రజల కోసం పార్టీ మారడంలో తప్పు లేదన్నట్టుగా ఆయన్ని ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు వైకాపా ప్రయత్నిస్తోందంటున్నారు. అయితే, కొద్ది రోజుల కిందట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కోట్ల కలుసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టీడీపీలోకి ఆయన్ని ఆహ్వానించారనే ప్రచారమూ జరిగింది. ఒకవేళ కేడర్ ఒత్తిడి మేరకే ఆయన క్రియాశీల రాజకీయాల్లో ఉందామని నిర్ణయించుకున్నా… ఏ పార్టీవైపు మొగ్గు చూపుతారు అనేది కూడా చర్చనీయాంశమే. ఇంతకీ, వైకాపా నుంచి ఆఫర్ అంటూ మొదలైన ఈ చర్చపై కోట్ల ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.