ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భవిష్య రాజకీయ కార్యాచరణను ఏవిధంగా రూపొందించుకోవాలి? ఎలాంటి కొత్త బంధాలను పెంచుకోవాలి? ఏ వ్యూహాల ప్రకారం నడవాలి? విపక్షాల్లో ఇలాంటి సందేహాలు చాలా సహజంగానే ఉంటాయి. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో విపక్షాల పరంగా శూన్యత ఉన్నదనే అభిప్రాయం కాంగ్రెస్ పార్టీలో వ్యక్తం అవుతున్నట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ ఆ పాత్రను నిర్వర్తించడంలో విఫలం అవుతున్నదని, ఈ సమయంలో తాము కాస్త గేరప్ అయితే వచ్చే ఎన్నికల నాటికి ప్రజాదరణను పొందడం సాధ్యమవుతుందని కాంగ్రెసు పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
తాజాగా విజయవాడలో పీసీసీ కార్యాలయాన్ని ప్రారంభించిన నేపథ్యంలో వారికి కేంద్ర పార్టీ పరిశీలకుడు దిగ్విజయసింగ్నుంచి కూడా ఈ మేరకు మార్గదర్శనం లభించినట్లుగా తెలుస్తున్నది. డిగ్గీరాజా రాష్ట్రానికి వచ్చి రెండు రోజులు విజయవాడలోనే ఉంటున్న సందర్భంగా పార్టీ నాయకులు ఆయనతో చాలా విషయాల్లో క్లారిటీ తీసుకోవడానికి ప్రయత్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో తాము అనుసరించాల్సిన వైఖరి ఎలా ఉండాలి? అనే విషయంలో కూడా ఆయన మార్గదర్శనం అడిగారు. రాష్ట్రంలో విపక్షాలు బలహీన పడిపోకుండా.. వారితో కలిసి ప్రభుత్వం మీద దండయాత్ర సాగించవచ్చునా..? అనేది పీసీసీ నేతల అభిప్రాయంగా కనిపిస్తున్నది. అయితేడిగ్గీ రాజా మాత్రం తన జవాబును బహిరంగంగానే వెల్లడించారు.
వైఎస్సార్ కాంగ్రెస్తో జతకట్టి తెలుగుదేశం మీద దండయాత్రకు పూనుకోవడం అనేది కాంగ్రెస్ పార్టీకి ఆత్మహత్యా సదృశం అవుతుందని ఆయన అంచనా వేసినట్లుగా కనిపిస్తున్నది. వైకాపా హవా కూడా పెద్దగా లేనందున… వారితో జతకట్టే బదులు తాముగా, తెదేపా మీద పోరాటాలు సాగిస్తే.. వచ్చే ఎన్నికల నాటికైనా తమకంటూ అస్తిత్వాన్ని తిరిగి సంపాదించుకోవచ్చునని ఆయన వారికి సూచించారు. దానికి తగినట్లుగానే తన ప్రెస్మీట్లో వైఎస్ జగన్ మీద కూడా ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ ఏనాడైనా కడప జిల్లా గురించి అక్కడి సమస్యల గురించి మాట్లాడారా అంటూ దెప్పిపొడిచారు. విభజన చట్టంలోనే కడపస్టీల్ ఫ్యాక్టరీ ప్రస్తావన ఉండగా.. జగన్ దాన్ని గురించి ఏనాడూ మాట్లాడకుండా జిల్లాకు ద్రోహం చేస్తున్నారంటూ డిగ్గీరాజా విరుచుకుపడడం విశేషం. దీంతో వైకాపా తో కాంగ్రెస్ సంబంధాలు ఎలా ఉండబోతున్నాయో స్పష్టమైన సంకేతాలు ఇచ్చేసినట్లే. ఏదేమైనా తాము మళ్లీ ఒక పార్టీగా ఏపీలో నిలబడడం మీదే వారికి ఫోకస్ ఉన్నది తప్ప.. మరొకరి ఊతంతో నిలబడాలనే ధ్యాసలేనట్లుగా కనిపిస్తోంది.