విజయవాడలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధర్మ పోరాట దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. సీఎంకి మద్దతు పలికేందుకు రైతులు, ముస్లింలు యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సీఎం దీక్ష గురించి ఎంపీ గల్లా జయదేవ్ స్పందిస్తూ… ఏపీ ప్రజల చిత్తశుద్ధికి ఈ దీక్షే నిదర్శనమన్నారు. జాతీయ పార్టీలను నమ్మలేని పరిస్థితి ఆంధ్రాలో ఇప్పుడుందన్నారు. ఆంధ్రాను దెబ్బతీయడానికి కేంద్రం ప్రయత్నిస్తూ ఉండటం సరికాదనీ, తమిళనాడు తరహా రాజకీయాలు చేయడం సరికాదని జయదేవ్ హితవు పలికారు. కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధివైపు నడిపించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందన్నారు.
ఇక, ప్రతిపక్షం వైకాపా కూడా చంద్రబాబు దీక్షపై స్పందించింది. ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ… సీఎం చేస్తున్నది ధర్మ దీక్ష కాదనీ, కేవలం ఉపవాసం మాత్రమే అని ఎద్దేవా చేశారు. ఈ దీక్ష ఢిల్లీలో చేసి ఉంటే ఈపాటికి ప్రత్యేక హోదా వచ్చి ఉండేదన్నారు. హోదా కోసం వైకాపా ఎంపీలు రాజీనామాలు చేసి, ఢిల్లీలో దీక్ష చేశారనీ, కానీ ప్రభుత్వం తమ దీక్షను భగ్నం చేసిందన్నారు. ప్రస్తుతం చంద్రబాబు చేస్తున్నది దొంగ దీక్ష అన్నారు. దీని కోసం రూ. 30 కోట్ల ప్రజాధనం వృథా చేశారంటూ రోజా ఆరోపించారు.
ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా స్పందిస్తూ.. సీఎం చేస్తున్న దీక్ష చూస్తుంటే ఒక ఈవెంట్ లా ఉందన్నారు. చంద్రబాబుకి ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధి లేదనీ, నాలుగేళ్లపాటు భాజపాకి మద్దతు ఇచ్చి, ఇవాళ్ల దీక్షలూ ఉద్యమాలు అంటూ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందనీ, తొలి సంతకం హోదా ఫైల్ మీదే ఉంటుందని మరోసారి హామీ ఇచ్చారు. ప్రత్యేక హోదా మాట ఎత్తితేనే జైల్లో పెట్టారనీ, ఇప్పుడు వారే దీక్షలు చేస్తుండటం విడ్డూరంగా ఉందన్నారు. ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ స్పందిస్తూ… ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు ఢిల్లీలో దీక్ష చేయాలన్నారు. రాష్ట్రమంతా ఐకమత్యంగా పోరాటానికి దిగితే హోదా వస్తుందన్నారు. ఒకర్ని ఒకరు ఎద్దేవా చేసుకోవడం, విమర్శించుకోవడం ద్వారా చులకన అయిపోతామని అభిప్రాయపడ్డారు. సో… చంద్రబాబు దీక్ష నేపథ్యంలో వీరందరి స్పందనలో కామన్ పాయింట్ ఏంటంటే.. సీఎం ఢిల్లీ వెళ్లి దీక్ష చేయాలని!