ఆంధ్రప్రదేశ్‌లో అప్పుడే సర్వేల హడావుడి ప్రారంభమయింది. ఎన్నికలకు ఇంకా రెండున్నరళ్లకుపైగానే ఉన్నప్పటికీ ఏదో ఓ పేరుతో సోషల్ మీడియాలో సర్వేలు పెట్టేస్తున్నారు. తాజాగా వైసీపీ రెబల్ ఎంపీ కూడా ఓ సర్వే ప్రకటించారు. తాను రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున టెలీఫోన్ సర్వే చేయించానని అందులో వైసీపీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో యాభై సీట్లు కూడా రావని ప్రకటించారు. పశ్చిమగోదావరి జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు, చిత్తూరు జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేల పరిస్థితి మాత్రమే బాగుందని ఇంకెవరూ గెలిచే పరిస్థితి లేదన్నారు. నర్సాపురంలో జగన్ కంటే తనకే తొంభై శాతం ఎక్కువ ఆదరణ ఉందని చెప్పుకొచ్చారు.
నిజంగా అయితే ఈ సర్వేను రఘురామకృష్ణరాజు బయట పెట్టదల్చుకోలేదట. కానీ ఇతర వైసీపీ నేతలు చేసిన కొన్ని చిల్లర పనుల వల్ల బయట పెట్టాల్సి వచ్చిందని ఆయన చెబుతున్నారు. ఆ పనులేమిటంటే.. తనపై సర్వే చేయడం. ఇటీవల కొంత మంది వైసీపీ నేతలు రఘురామకృష్ణరాజు పనితీరుపై సర్వే అంటూ కొన్ని గణాంకాలు సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఆయన పార్లమెంట్‌కు వెళ్లడం లేదని చెబుతున్నారు. దీనికి కౌంటర్ గా రఘురామ ఈ సర్వేను బయట పెట్టారు. నిజంగా సర్వే చేశారో లేదో .. లేకపై తనపై సర్క్యూలేట్ చేస్తున్న సర్వే కోసం క్రియేట్ చేశారో కానీ.. ఓ క్యూరియాసిటీ అయితే మాత్రం రఘురామ కల్పించారు.
ప్రస్తుత పరిస్థితినే తాను చెప్పానని తర్వాత పరిస్థితులు మాత్రమే సీట్లు నూట యాభై దాటవచ్చు లేకపోతే యాభై కంటే తక్కువ రావొచ్చని డిస్ క్లెయిమర్ కూడా ప్రకటించారు. ఇటీవల ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్స్ ప్రకటించిన తర్వాత సోషల్ మీడియా సర్వేల హడావుడి పెరిగిపోయింది. ఏపీలో ఇది మరీ ఎక్కువగా ఉంది. దీనికి రఘురామకృష్ణరాజు తన సర్వేతో మరింత ఆజ్యం పోశారని అనుకోవచ్చు. అయితే రఘురామ సర్వే చేయించి ఉండరని.. తనపై చేస్తున్న ప్రచారానికి కౌంటర్‌గా అలా ప్రకటించి ఉంటారన్న అభిప్రాయాలు రాజకీయ పార్టీల్లో వ్యక్తమవుతున్నాయి.