రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక అనే వార్త రాగానే.. తెలుగు రాష్ట్రాల్లో అందరి దృష్టి తెలంగాణ రాష్ట్ర సమితి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై పడింది. భారతీయ జనతా పార్టీతో అంతర్గతంగా సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ.. బయటకు మాత్రం తాము వ్యతిరేకమని చెబుతున్న ఈ పార్టీల వైఖరి ఈ ఎన్నికతో బయటపడి పోతుందని రాజకీయ విశ్లేషకలు చెబుతూ వచ్చారు. అందుకే ఈ రెండు పార్టీలకు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక ఓ విషమ పరీక్ష లాంటిదని చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ విషమ పరీక్ష ను..ఆ పార్టీలు ఫేస్ చేశాయి. ఇందులో బీజేపీకి అనుకూల పార్టీలుగా తమపై పడిన ముద్రను చెరిపేసుకోలేకపోగా.. మరితంగా బలపరుచుకున్నాయి. దాంతో ఈ రెండు లిట్మస్ టెస్ట్ లో ఫెయిలయినట్లుగా రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటూ తప్పించుకోలేని పరిస్థితి. కేసుల భయమో.. రాజకీయ వ్యూహమో కానీ… టీడీపీ ఎన్డీఏలో ఉన్నప్పటి నుంచే ..బీజేపీతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తోంది. అన్ని విధానపరమైన నిర్ణయాలతో పాటు.. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతిచ్చారు. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత.. వైసీపీకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. టీడీపీ వెళ్లిపోయినా.. తాము ఉన్నామనే భరోసాని వైసీపీ నేతలు… బీజేపీకి ఇవ్వడం వల్లే.. ఏపీకి సాయం చేయడం లేదని టీడీపీ ప్రచారం చేస్తోంది. బీజేపీ, వైసీపీ మధ్య లోపాయికారీ అవగాహన ఉందన్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తోంది. లోక్‌సభ ఎంపీల రాజీనామాల వంటి సెల్ఫ్ గోల్స్‌తో దీన్ని ప్రజలు నమ్ముతున్నారు కూడా. దీంతో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో బీజేపీ కూటమి అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేసి.. తమ చిత్తశుద్ధిని నిరూపించుకుంటామని జగన్ ప్రకటించారు. కానీ తీరా చూస్తే.. ఎన్నిక కాసేపట్లో జరుగుతుందనగా.. తాము ఓటింగ్‌కు బహిష్కరిస్తున్నట్లు విజయసాయిరెడ్డి ప్రకటించారు. దీంతో …బీజేపీ వ్యతిరేకపక్షాలకు వచ్చే ఓట్లు తగ్గిపోయాయి. ఈ విధంగా బీజేపీకి వైసీపీ సాయపడింది. కాంగ్రెస్ ఏపీకి అన్యాయం చేసింది కాబట్టి.. ఆ పార్టీకి కూడా తాము ఓటు వేయబోమని.. కారణంగా వైసీపీ చెబుతున్నా.. ఇన్ని రోజులుగా చెబుతూ వస్తున్న మాటలకు ఒక్కసారిగా యూటర్న్ తీసుకోవడంతో… వైసీపీపై బీజేపీ ముద్ర బలంగా పడిపోయినట్లయింది.
ఇక టీఆర్ఎస్ పార్టీ కూడా.. బీజేపీని బహిరంగంగా సమర్థించలేని పరిస్థితుల్లో ఉంది. తెలంగాణకు సంబంధించిన ఏ ఒక్క సమస్యను కూడా బీజేపీ ప్రభుత్వం పరిష్కరించలేదు. పరిష్కరించే ఉద్దే్శం ఉన్నట్లు కూడా కనిపించడం లేదు. రెండు సార్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ వెళ్లి.. చిట్టా ఇచ్చి వచ్చినా కదలిక లేదు. తెలంగాణను కేంద్రం పట్టించుకోడం లేదని… టీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నా.. మళ్లీ వెళ్లి బీజేపీకే మద్దతు తెలిపారు. దీంతో టీఆర్ఎస్ పూర్తిగా బీజేపీ అనుకూల వైఖరి బయటపడింది. ఇక విపక్ష పార్టీలు చేసే విమర్శలను తట్టుకోవడం కష్టమే. ఈ పరిస్థితి.. తెలంగాణలోను ముస్లిం ఓటు బ్యాంక్‌పై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో రెండు పార్టీలు.. తమపై ఉన్న బీజేపీ నీడను తుడిపేసుకోవడం మాత్రం ఫెయిలయ్యాయి.