ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో రోజూ.. కామన్‌గా ఓ అంశం కనిపిస్తోంది. అదే ప్రతిపక్ష నేత చంద్రబాబును ఏదో ఓ సందర్భంలో వ్యక్తిగతంగా దూషించడం. అధికార పార్టీ వ్యూహమో.. లేక ఆ పార్టీ సభ్యులు ఫ్లో అలా అనేస్తున్నారో కానీ.. ప్రతీ రోజూ.. ఏదో ఓ సందర్భంలో.. చంద్రబాబుపై వ్యక్తిగత దూషణలు అసెంబ్లీలో.. బయట కూడా వినిపిస్తున్నాయి…! ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి .. ప్రతిపక్ష నేత చంద్రబాబుపై.. చేసే విమర్శలు… ఎక్కువ వ్యక్తిగతంగానే ఉంటాయి. ఆయన తన విధానాలను డిఫెండ్ చేసుకునే విధానం… రివర్స్ ఎటాకింగ్ గా ఉంటుంది. ఈ క్రమంలో అచ్చెన్నాయుడు పర్సనాల్టీపై గతంలో తీవ్ర విమర్శలు చేసేవారు. ఈ సమావేశాల్లో అచ్చెన్నాయుడుపై దృష్టి తగ్గించి.. చంద్రబాబుపై కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. తొలి రోజే కుక్కతోక వంకర అంటూ.. చంద్రబాబును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.
ఆ తర్వాత 40ఏళ్ల అనుభవం ఎందుకు… బుద్ది లేదా వంటి విమర్శలు అసువుగా వచ్చేస్తున్నాయి. విధాన పరమైన చర్చల్లోనూ.. వ్యక్తిగతంగా కించ పరిచే మాటలు .. తరచూ వస్తున్నాయి. సాక్షాత్తూ సీఎం జగనే..ప్రతిపక్ష నేతపై ఇలా వ్యక్తిగత విమర్శలకు దిగితే.. ఆయనను మెప్పించాలనుకునే సభ్యులు మాత్రం ఎందుకు కామ్‌గా ఉంటారు. రోజా లాంటి నేతలయితే.. ప్రాస చూసుకుని మరీ.. వ్యక్తిగతంగా కించ పరిచే మాటలు మాట్లాడటం ప్రారంభించారు. ఇక చందర్బాబు అంటే ఒంటి కాలిపై లేచే మంత్రి కొడాలి నాని.. అసెంబ్లీలో వాడిని అన్ పార్లమెంటరీ పదాలు అన్నీ ఇన్నీ కావు. బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు తనపై స్పీకర్ తమ్మినేని సీతారం చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం చెందారు. మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలంటే… ఇదేమైనా ఖవ్వాలి డాన్సా అని …స్పీకర్ వ్యాఖ్యానించడం.. చంద్రబాబులో అసహనాన్ని పైకి తెచ్చింది. అసెంబ్లీ లోపల చంద్రబాబును వ్యక్తిగతంగా దూషించడం.. విమర్శించడం మాత్రమే కాదు.. బయట కూడా.. మాజీ ముఖ్యమంత్రికి అవమానాలు తప్పడం లేదు.
అసెంబ్లీలోకి వెళ్లకుండా నలభై నిమిషాల పాటు చంద్రబాబును గేటు వద్దనే నిలబెట్టారు. మార్షల్స్ ఆయనను తోసివేశారు కూడా తనపై చేస్తున్న వ్యక్తిగత విమర్శలపై.. చంద్రబాబు కూడా.. ఆగ్రహాన్ని దాచుకోలేకపోతున్నారు. తనను అవమానించడానికే అసెంబ్లీ సమావేశాలు పెడుతున్నారా.. అని ట్విట్టర్లో ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతను ఇలా వ్యక్తిగతంగా ఎందుకు కించ పరుస్తున్నారన్నదానిపై.. రాజకీయవర్గాలు భిన్నమైన విశ్లేషణ చేస్తున్నాయి. ప్రభుత్వంపై గట్టిగా మాట్లాడితే వ్యక్తిగత దూషణలు ఉంటాయన్న ఓ రకమైన భావన కల్పించి.. మాట్లాడే విషయంలో కట్టడి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారంటున్నారు. మానసికంగా దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారంటున్నారు.