భారతీయ జనతా పార్టీతో కలిసి రఘురామకృష్ణంరాజు ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారని మంత్రి రంగనాథరాజు ఓ వైపు విమర్శలు గుప్పించారు. మరో వైపు.. రఘురామకృష్ణంరాజు ఎవరితో కలిసి ఇదంతా చేస్తున్నారో అందరికీ తెలుసని.. ఢిల్లీలో విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. ఇతర వైసీపీ నేతలు.. రఘురామకృష్ణంరాజు బీజేపీలో చేరడానికే.. వైసీపీపై నిందలేస్తున్నారని… విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటి వరకూ భారతీయ జనతా పార్టీతో తమకు సన్నిహిత సంబంధాలున్నాయని.. వైసీపీ నేతలు చెప్పుకుంటూ ఉండేవారు. రాష్ట్రంలో ఎవరైనా బీజేపీ నేతలు వైసీపీ సర్కార్కు వ్యతిరేకంగా మాట్లాడితే.. వారిని టీడీపీకి అమ్ముడుబోయారని విమర్శిస్తారనే కానీ.. బీజేపీని పల్లెత్తు మాట అనేవాళ్లు కాదు. అయితే ఇప్పుడు మాత్రం పరిస్థితి మారిపోయింది.
నేరుగా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వాన్ని వైసీపీ నేతలు టార్గెట్ చేసుకుంటున్నారు. రఘురామకృష్ణంరాజు వెనుక బీజేపీ ఉందని.. నమ్మకానికి వచ్చేసి.. తమ పార్టీ గుర్తింపు మీదే గురి పెట్టారన్న అనుమానాలు ఆ పార్టీలో ప్రారంభమయ్యాయి. గతంలో.. పలుమార్లు జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఈసీ లేఖలు రాసింది. వైఎస్ఆర్ అనే పదం వాడవద్దని ఆ లేఖల సారాంశం. ఆ విషయం రఘురామకృష్ణంరాజునే బయట పెట్టారు. అది మాత్రమే కాదు.. ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం.. ఓ రాజకీయ పార్టీ చేపట్టాల్సిన చర్యలేవీ.. వైసీపీ చేపట్టలేదు. వీటన్నింటినీ.. నర్సాపురం ఎంపీ వెలుగులోకి తెచ్చి.. అదే అంశాలతో.. ఆ పార్టీ గుర్తింపు రద్దు కోసం.. కొత్త తరహాలో పోరాటం చేస్తున్నారు. దీని వెనుక ఖచ్చితంగా బీజేపీ ఉందని… రఘురామకృష్ణంరాజుకు కావాల్సిన సహకారం అంతా బీజేపీ నుంచి అందుతోందని వైసీపీ ఓ అంచనాకు వచ్చింది.
భారతీయ జనతా పార్టీకి తాము రాజ్యసభ సీటు ఇచ్చామని.. తాము చెప్పినట్లుగా వారు వింటారని.. వైసీపీ అగ్రనేతలు ఆశ పడుతూ వచ్చారు. అందుకే… కేంద్రంతో సంబంధం ఉన్న వివిధ నిర్ణయాలను అసువుగా తీసుకుంటూ వస్తున్నారు. మూడు రాజధానుల అంశానికి మొదట్లో సహకారం తెలిపినా… తర్వాత సైలెంటయిపోయింది. తర్వాత మండలి రద్దు సహా ఏ అంశంలోనూ… వైసీపీకి బీజేపీ సహకరించడం లేదు. పైగా… ఇటీవలి కాలంలో ప్రభుత్వంపై విరుచుకుపడటం ఎక్కువయింది వీటన్నింటిని పరిశీలించిన వైసీపీకి.., బీజేపీ తమను టార్గెట్ చేసిందన్న నిర్ణయానికి వచ్చినట్లుగా డిసైడ్ అయింది. అందుకే.. ఇక నేరుగా.. బీజేపీ హైకమాండ్ పైనే గురి పెట్టాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. నిజంగా బీజేపీ కన్నెర్ర చేయాలనుకుంటే… వైసీపీని నిర్వీర్యం చేయడం… ఒక్క రోజులో పని అని ఇతర రాజకీయ పార్టీలు వ్యాఖ్యానిస్తున్నాయి. మొత్తానికి ఏపీ రాజకీయంలో మాత్రం స్పష్టమైన మార్పు కనిపిస్తోంది.