వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ఆ పార్టీ నేతలు ఎదురుదాడి ప్రారంభించారు. కులాల్లో చిచ్చు పెడుతున్నారన్న ఆరోపణలు చేయడంతో.. పశ్చిమగోదావరి జిల్లా వైసీపీ నేతలందర్నీ మంత్రి పేర్ని నాని మీడియా ముందుకు తీసుకువచ్చారు. షరా మామూలుగా… రఘురామకృష్ణంరాజు సామాజికవర్గానికే చెందిన మంత్రి శ్రీరంగనాథరాజును ముందు పెట్టి విమర్శలు గుప్పించారు. పార్టీ మారాలనుకుంటే వెళ్లిపోవాలి, అనవసర వ్యాఖ్యలు చేయొద్దని శ్రీరంగనాథరాజు ఎంపీని హెచ్చరించారు. రఘురామకృష్ణంరాజు కోసం… బ్యానర్ కట్టే కేడర్ కూడా లేదని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే సత్యనారాయణ మండిపడ్డారు.
ఒక్కసారి పోటీ చేయడానికే 3 పార్టీలు మారిన చరిత్ర రఘురామకృష్ణంరాజుదని.. భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ దెప్పి పొడిచారు. ఇక మంత్రి పేర్ని నాని తనదైన భాషలో విరుచుకుపడ్డారు. రఘురామకృష్ణంరాజు పోటుగాడైతే… నామినేషన్ వేసి విత్ డ్రా ఎందుకు చేసుకున్నారని.. 2014 ఎన్నికల నాటి ఘటనను చూపి ఎత్తి పొడిచారు. బలమైన వ్యక్తి అయితే సొంతంగా పోటీ చేయొచ్చు కదా… ఆ పార్టీ… ఈ పార్టీ ఎందుకు అని ప్రశ్నించారు. రఘురామకృష్ణంరాజు బతిమిలాడి మరీ తిరిగి వైసీపీలో చేరారని.. వైఎస్ బొమ్మ… జగన్ కష్టంతోనే అధికారంలోకి వచ్చామని పేర్నినాని తేల్చేశారు.
ఇప్పటి వరకూ సైలెంట్‌గా ఉన్న వైసీపీ నేతలు… రఘురామకృష్ణంరాజును ఇక ఉపేక్షించకూడదని నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు. అందుకే ఎదురుదాడి చేస్తున్నారు. అందరూ.. రఘురామకృష్ణంరాజుపై ఎదురు దాడి చేస్తున్న సమయంలోనే.. ఎంపీకి అమిత్ షా అపాయింట్మెంట్ ఖరారయిందనే ప్రచారం సోషల్ మీడియాలో ప్రారంభమయింది. దీంతో అంతర్గతంగా ఏదో జరుగుతోందన్న అభిప్రాయం వైసీపీ వర్గాల్లోనే కలుగుతోంది. ఓ వారంలో… వైసీపీలో రఘురామరాజు వ్యవహారంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.