మరోసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ వర్సెస్ కన్నా వార్ ప్రారంభమయింది. బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా కన్నాను చూడకుండా.. ఆయననో ప్రభుత్వ వ్యతిరేక నేతగా మాత్రమే పరిగణించే వైసీపీ నేతలు తాజాగా భూకబ్జా ఆరోపణలు ప్రారంభించారు. దీనికి కారణం కన్నా లక్ష్మినారాయణ దేవాదాయ ఆస్తులు.. టీటీడీ భూములను ప్రభుత్వం అమ్ముతోందంటూ… కన్నా నిరాహారదీక్ష ప్రారంభించారు. హిందువుల ఆలయాల జోలికి రావొద్దని చాలా సార్లు చెప్పామని .. అయినా వినడం లేదని దీక్ష ప్రారంభిస్తూ మండిపడ్డారు. మంగళగిరి, అన్నవరం ఆలయ భూములు తీసుకునే ప్రయత్నం చేశారని .. బీజేపీ ఆందోళనతో వెనక్కి తగ్గి.. ఇప్పుడు ఏకంగా తిరుమల వెంకన్న భూములకే ఎసరు పెట్టారని విమర్శించారు.
టీటీడీ భూములు అమ్మే జీవో రద్దు చేయలేదని.. దేవుడిని కూడా మోసం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ అధికారంలోకి వచ్చాక చేసిన ప్రతి పని ప్రజలను మోసం చేసేదేనని ప్రజలను మభ్య పెట్టేందుకే జీవో ఇచ్చారని విమర్శలు గుప్పించారు. కన్నా విమర్శలపై వైసీపీ భిన్నంగా స్పందించింది. ఆలయ భూముల రక్షణ కోసం దీక్ష చేస్తున్నట్లుగా చెబుతున్న.. కన్నానే .. ఆలయ భూములు కబ్జా చేశారని.. ప్రతి ఆరోపణలు చేశారు. కృష్ణా జిల్లా నూజివీడులో వెంకటాచలం భూములు 18 ఎకరాలు కబ్జా చేశారని.. వాటి గురించి త్వరలోనే బయట పెడతామని.. ఎమ్మెల్యే మల్లా విష్ణు హెచ్చరించారు. జగన్ హిందూ మతానికి వ్యతిరేకం అంటూ మా పై దుష్ప్రచారం చేస్తున్నారని.. మండిపడ్డారు. కన్నా లక్ష్మినారాయణపై వ్యూహాత్మకంగా కబ్జా ఆరోపణలు వైసీపీ నేతలు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది.
ప్రత్యేకంగా నూజివీడు వెంకటాచలం భూముల గురించి చెప్పి.. త్వరలో బయటపెడతామని చెప్పడం ద్వారా.. ఈ అంశంపై మరో సారి మాట్లాడవద్దని.. బ్లాక్ మెయిల్ చేసినట్లుగా వైసీపీ నేతల విమర్శలు ఉన్నాయన్న అభిప్రాయం ఉంది. వివిధ సందర్భాల్లో ప్రభుత్వంపై… కన్నా లక్ష్మినారాయణ విరుచుకుపడుతున్నారు. అలా విరుచుకుపడినప్పుడల్లా ఆయనపై టీడీపీ ముద్ర వేసి వైసీపీ నేతలు విమర్శలు చేసేవారు. ఇప్పుడు.. ఆయనపై కబ్జా ఆరోపణలు ప్రారంభించారు.