ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ సంక్షోభం ఏర్పడింది. దీనికి కారణం ఎవరు..? అంటే.. తెలుగుదేశం పార్టీ వైపే చూపిస్తున్నారు వైసీపీ నేతలు. చంద్రబాబు … విద్యుత్ కంపెనీలకు బిల్లులు కట్ట కుండా వెళ్లారని.. అందుకే.. ఆయా విద్యుత్ కంపెనీలు.. విద్యుత్ నిలిపివేశాయని చెబుతున్నారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి దగ్గర నుంచి ప్రతీ ఒక్కరూ ఆదే మాట కోరస్లో వినిపిస్తున్నారు. ఒప్పందాలు చేసుకున్న ఏ విద్యుత్ ఉత్పత్తి సంస్థలకైనా.. బిల్లులు పద్దతి ప్రకారం కట్టకపోతే.. సరఫరా నిలిపివేస్తాయి. దానికో వ్యవస్థ ఉంటుంది. ఆ విషయం సామాన్యులకు తెలియదు కాబట్టి.. టీడీపీపై నిందలేస్తే.. సరిపోతుందని అనుకుంటున్నట్లుగా ఉన్నారు వైసీపీ నేతలు.
గత ఏడాది సెప్టెంబర్ 29వ తేదీన ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఉత్పత్తి 5 వేల మెగావాట్లపైనే ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్ 29న ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఉత్పత్తి 3 వేల మెగావాట్లకు కొంచెం ఎక్కువగా ఉంది. ఎలా లేదన్నా.. దాదాపుగా రెండు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లోటు కనబడుతోంది. ఉత్పత్తి ఇంత దారుణంగా పడిపోవడానికి కారణం ఎవరు..? పరిస్థితులకు అనుగుణంగా… ఎందుకు నిర్ణయాలు తీసుకోలేకపోయారు..? బొగ్గు కొరత ఏర్పడే అవకాశం ఉందని తెలిసినా.. ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదో మాత్రం.. ప్రభుత్వం రివ్యూ చేసుకోవడానికి సిద్ధంగా లేదు. ఈ విషయంలో పీపీఏలు కూడా దెబ్బకొట్టాయి. ఆయా కంపెనీలకు నిధులు ఇవ్వకపోవడంతో.. కేంద్రానికి ఫిర్యాదు చేశాయి. దాంతో కేంద్రం ఏ విద్యుత్ కంపెనీ .. ఏపీకి కరెంట్ అమ్మకుండా నిషేధించింది.
వాస్తవాలు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతూండగా.. వైసీపీ మాత్రం.. నిర్మోహమాటంగా.. ప్రతిపక్షంగా నెట్టేసి… తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. ఇంత వరకూ సమస్య పరిష్కారం కోసం.. విద్యుత్ మంత్రి ఒక్క రివ్యూ కూడా చేయలేదు. పరిష్కార మార్గాలు అన్వేషిస్తున్నట్లుగా ప్రభుత్వం కనిపించలేదు. కానీ రాజకీయం మాత్రం ప్రారంభించేసింది. ఇసుక కొరత, కరెంట్ కోతల్లాంటివి… ప్రజల రోజువారీ జీవితాలపై ప్రభావం చూపే అంశాలు. వీటి విషయంలో సర్కార్ శరవేగంగా స్పందించకపోతే… ప్రజావ్యతిరేకత పెరిగిపోయే అవకాశం ఉంది. ప్రతిపక్షంపై నిందలు రాజకీయానికి పనికి వస్తుంది కానీ… బాధ్యత ఉన్నది అధికారపక్షం మీదేనని ప్రజలు కూడా నమ్ముతారు.