లంచాలు తీసుకునే వాళ్లనే పక్కన పెడుతున్నామని వైసీపీ చెప్పడం ప్రారంభించింది. ఆ పార్టీ నెంబర్ టు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారు. అవినీతి పరులు, లంచగొండులు , చేతకాని వాళ్లను మాత్రమే జగన్ రెడ్డి పక్కన పెట్టి .. కొత్త వారికి టిక్కెట్లు ఇస్తున్నారని ఆయన అంటున్నారు. ఆయన మాటలు విని అందరూ అవాక్కవుతున్నారు. టిక్కెట్లు ఎగ్గొట్టడమే కాకుండా తమపై నిందలు వేయడం ఏమిటన్న చర్చ .. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో కొనసాగుతోంది.
నిజానికి పెద్దిరెడ్డి కావాలని అన్నారో… తమ తీసివేతలకు ఓ లాజిక్ చెప్పాలనుకున్నారో కానీ ఆయన .. తమ పార్టీకి అండాదండాగా నిలిచిన దళితులపైనే కామెంట్లు చేస్తున్నారు. మార్పు చేసిన దళిత ఎమ్మెల్యేలందరూ అవినీతి పరులు, చేతకాని వాళ్లు అన్నట్లుగా పెద్దిరెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పటికే జగన్ రెడ్డి తన చేతకాని పరిపాలనతో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారన్న కారణంగానే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిందని చెబుతున్నారు. ఇలాంటి సమయంలో దళిత ఎమ్మెల్యేల వల్లే తప్పులు జరిగాయన్నట్లుగా ప్రచారం ప్రారంభించడం వైసీపీ పెత్తందారుల తీరుకు నిదర్శనంగా మారింది.
ప్రభుత్వంపై వ్యతిరేకత లేదని ఎమ్మెల్యేల వల్లేనని చెప్పుకునేందుకు జగన్ రెడ్డిప్రయత్నిస్తున్నారు. కానీ పార్టీని చిందర వందర చేయగల ఎమ్మెల్యేలను మార్చేందుకు ఆయనకు ధైర్యం చాలడం లేదు. దళిత ఎమ్మెల్యేలను మాత్రమే టార్గెట్ చేసుకున్నారు. తర్వాత బీసీ,కాపు వర్గాలను టార్గెట్ చేసుకున్నారు. వారందర్నీ బలిపశువుల్ని చేసి రాజకీయం చేస్తున్నారు. ముందు ముందు సొంత ఎమ్మెల్యేలపై సాక్షి పత్రికలతో తప్పుడు కథనాలు రాసినా ఆశ్చర్యం లేదని అనుకోవచ్చు.