తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఫలితాలు వచ్చాయి. అయితే రాజకీయంలో ఉండాల్సిన ఎఫెక్ట్ కనిపించలేదు. ఎందుకంటే ఈ ఎన్నికల నుంచి విపక్ష పార్టీలు పారిపోయాయి. ఏపీలో వైసీపీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. తెలంగాణలో బీఆర్ఎస్ పోటీ చేయలేదు. నిన్నామొన్నటి వరకూ అధికార పార్టీలుగా ఉండి టీచర్ ఎమ్మెల్సీల్లోనూ గెలిచిన ఈ పార్టీలు ఇప్పుడు పట్టభద్రుల స్థానాల్లోనూ పోటీ చేయడానికి వెనుకడుగు వేశాయి. కానీ ఫలితాలపై మాట్లాడేందుకు మాత్రం వెనుకాడటం లేదు. అధికార పార్టీలపై వ్యతిరేకత పెరిగిందని చెప్పుకునేందుకు ముందుకు వస్తున్నాయి.
పోటీ చేయని బీఆర్ఎస్ ఏం చెబుతుంది ?
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పట్టభద్రుల ఉపఎన్నికల్లో అనుకున్నంతగా ఫలితం రావడం లేదు. టీచర్ ఎమ్మెల్సీల్లో పోటీ చేయలేదు.కమ్యూనిస్టులకు మద్దతు ఇచ్చారు. టీచర్ ఎమ్మెల్సీలు పూర్తిగా వారి సంఘాల రాజకీయం కాబట్టి దానిలో రాష్ట్ర రాజకీయాలను చూడలేం.ఆ సంగతి పక్కన పెడితే పట్టభద్రుల ఉపఎన్నికలో కాంగ్రెస్ కు తమ రెబల్ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ వల్ల సమస్యలు వచ్చాయి. ఇప్పుడు కాంగ్రెస్ కు మద్దతు తగ్గిపోయిందని బీఆర్ఎస్ ప్రచారం చేయవచ్చు. ఇవాళ్టి నుంచి వారి పని అదే. కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ప్రచారం చేస్తారు. మరి బీఆర్ఎస్కు సానుకూలత ఉందా అని వచ్చే ప్రశ్నలకు సమాధానం ఉండదు. ఎందుకంటే వారు ఎన్నికల్లో పోటీ చేయలేదు. కాంగ్రెస్ కాకపోతే తమకే ప్రజలు ఓట్లేస్తారని అనుకుంటే.. ఎన్నికల్లో పోటీ చేయాలి కదా !
పారిపోయిన వైసీపీ ఆత్మ వంచన
ఇక ఏపీలో ఎన్నికల్లో పోటీ కూడా చేయకుండా పారిపోయిన వైసీపీ నేతలు ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను చూపించి స్వయంతృప్తి పొందుతున్నారు. వ్యక్తిగత సంబంధాలో మరో కారణమో కానీ.. టీచర్స్ ఎన్నికల్లో కూటమి పార్టీలు విడిపోయాయి. టీడీపీ, జనసేన పాకలపాటి రఘువర్మకు.. బీజేపీకి గాదె శ్రీనివాసులనాయుడుకు మద్దతిచ్చాయి. యూటీఎఫ్ అభ్యర్థి కోసం వైసీపీ పని చేసింది. టీడీపీ, జనసేన మద్దతిచ్చిన రఘువర్మ ద్వితీయ ప్రాధాన్య ఓట్లతో ఓడిపోవడంతో కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత అని వైసీపీ స్వయంతృప్తి పొందుతోంది. టీచర్ సంఘాల మధ్య జరిగిన పోరులో ప్రభుత్వ వ్యతిరేకత అన్న ప్రశ్న రాదు.
వైసీపీకి భవిష్యత్ లేదని తేల్చిన ఎమ్మెల్సీ ఎన్నికలు
ఎన్నికల్లోవైసీపీ పోటీ చేయలేదు. టీడీపీని ఓడించడం టార్గెట్ గా రాజకీయంగా చేసింది. మూడో సారి పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావుకు మద్దతుగా పని చేసింది. గోదావరి జిల్లాల్లోనూ అంతే. అయితే వైసీపీకి ఏదైనా వ్యక్తికి లేదా పార్టీకి సపోర్టు చేస్తే.. ఆ పార్టీ బలం సగానికి పడిపోతుందని అనేక సారు రుజువు అయింది. అదే జరిగింది.కానీ వైసీపీ నేతలు ప్రభుత్వంపై వ్యతిరేకత అనే ప్రచారం చేసుకుని తమను తాము మోసం చేసుకుంటున్నారు. వారిని ఆ లోకం నుంచి బయటకు తీసుకురావడం కష్టమే.