పంచాయతీ ఎన్నికల్లో తాము ఎనభై శాతానికిపైగా గెల్చుకుంటున్నామని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి పెద్ద ఎత్తున ఖర్చు పెట్టడానికి కూడా వెనుకాడటం లేదు. ఎంత ప్రో న్యూస్ చానళ్లు అయినా చెప్పినట్లు చేయవు.. స్కోర్ బోర్డులు అదే పనిగా స్క్రీన్ మీద ఉంచడానికి గంటల లెక్కన ప్రకటనలు మాట్లాడుకునే పరిస్థితికి వైసీపీ వచ్చింది. సాధారణంగా అసెంబ్లీ ఎన్నికల స్కోర్ బోర్డులే.. తర్వాతి రోజు ఉదయానికి టీవీ చానళ్లు తీసేస్తాయి. కానీ నిన్న ఓ ప్రముఖ చానల్ అదే పనిగా పంచాయతీ ఎన్నికల ఫలితాల పేరుతో స్కోర్ బోర్డును రోజంతా ఉంచేసింది. దీనికి కారణం ఏమిటా అని ఆలోచిస్తే.. తెలిసింది.. అది ప్రకటన రూపంలో అక్కడ ఉంచేశారని.
ప్రభుత్వ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్న ఆ చానల్ నేరుగా ప్రకటన రూపంలోనో.. మరో విధంగా దానికి ప్రతిఫలం పొందబోతోందన్నమాట. సరే అదంతా బిజినెస్ అనుకున్నా… వైసీపీ … ఘనమైన ఫలితాలు సాధిస్తున్నా.. ప్రచారానికి ఎందుకింత తాపత్రయ పడుతోందన్నదే ఆసక్తికరంగా మారింది. ఎనభై శాతం పంచాయతీల్లో గెలుస్తూంటే.. అక్కడి ప్రజలే చెప్పుకుంటారు.. వైసీపీ గెలిచిందని. ఎలా గెలిచిందో కూడా చెప్పుకుంటారు. ప్రజా సంక్షేమ పాలనతో జగనన్నకు పట్టం కట్టారని చెప్పుకుంటారు. ఈ మౌత్ టాక్ కన్నా గొప్ప ప్రచారం ఏమీ ఉండదు. కానీ ఎందుకో కానీ వైసీపీ మీడియాలో ప్రచారానికి ఎక్కువ బడ్జెట్ కేటాయిస్తోంది. తమ చానల్లో వేసే అంకెలు.. తమ పార్టీ నేతలే నమ్మరని వారికి కూడా క్లారిటీ ఉందేమో కానీ.. తమ ప్రో అనిచెప్పుకునే ఇతర చానళ్లలో గంటల తరబడి ప్రచారానికి సమయం కేటాయిస్తోంది.
అందుకే.. కొంత మంది ఫలితాల విషయంలో వైసీపీ ఎందుకో కంగారు పడుతోందన్న భావన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో.. అధికార పార్టీకి మొగ్గు ఉంటుంది. అది ఎన్నికల్లో కనబడుతోంది. కానీ 90 శాతం లక్ష్యం పెట్టుకుని… ప్రజాస్వామ్య విరుద్ధమైనపనులు చేయడం వల్లనే… ప్రజలు ఓట్లు వేయడం ద్వారా గెలవలేదన్న అభిప్రాయం బలపడుతోందని.. దాన్ని కంట్రోల్ చేయడానికి వైసీపీ వ్యూహకర్తలు ఇలా ప్రో మీడియాకు పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయిస్తున్నారన్న చర్చ జరుగుతోంది.