షిరిడి సాయి ఎలక్ట్రికల్స్…ఈ పేరు వింటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు గుర్తు వచ్చేది జగన్ మాత్రమే. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ హయాంలో ఈ కంపెనీలు ఇచ్చిన పనులు, దోచి పెట్టిన భూముల గురించి ఎంత ప్రచారం జరిగిందో .. వారు ఎంతగా వాటిని సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లారో వారికి బాగా తెలుసు. అలాంటి కంపెనీ టీడీపీ రాగానే తొక్కి పట్టి నార తీస్తారని అందరూ ఊహిస్తారు. కానీ అసలు జరుగుతున్నదేమిటంటే.. ఆ కంపెనీ పెట్టుబడులు పెడుతుంది కదా అని వేల ఎకరాలు కేటాయిస్తున్నారు. నిజమా అని టీడీపీ కార్యకర్తలు సంభ్రమాశ్చర్యలకు లోను కావాల్సిన పరిస్థితి.
షిరిడి సాయి ఎలక్ట్రికల్స్‌కు వేల ఎకరాల భూములా?
సోమవారం జరిగిన కేబినెట్ సమావేశంలో షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కు 8,365 ఎకరాల భూమి కేటాయించాలని నిర్ణయించారు. అసలు ఈ కంపెనీ సామర్థ్యం ఎంత.. ఈ కంపెనీకి అంత పెట్టుబడి పెట్టే స్థోమత ఉందా అన్న ప్రశ్నల కన్నా కేబినెట్ లో ఇతర మంత్రుల నుంచి వచ్చిన ప్రశ్న.. ఇది వైసీపీకి చెందినవారిది సార్.. అనే. దానికి స్వయంగా చంద్రబాబు ఏ పార్టీ అయినా పెట్టుబడులు పెడతామంటే ఆహ్వానించాల్సిందే అని తేలికగా తీసుకుని భూకేటాయింపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఈ విషయం ఇప్పుడు కార్యకర్తల కడుపు రగిలిపోయేలా చేస్తోంది.
జగన్ బినామీ టీడీపీ పెద్దలకు పారిశ్రామిక సంస్థగా ఎలా కనిపిస్తోంది?
షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనే కంపెనీ కేవలం ట్రాన్స్ ఫార్మర్లు తయారు చేసే కంపెనీ. జగన్ సీఎం అయ్యే వరకూ అదే కంపెనీ ప్రోఫైల్. కానీ జగన్ వచ్చిన తర్వాత భారీ విద్యుత్ కంపెనీగా అవతారం ఎత్తింది. విద్యుత్ ప్రాజెక్టులు, పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులు కడతామని ఒప్పందాలు చేసుకుంది. ఈ కంపెనీ నర్రెడ్డి విశ్వేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి. ఆయన అవినాష్ రెడ్డి కుటుంబానికి, జగన్ కు అత్యంత సన్నిహితుడు. ఇంకా చెప్పాలంటే ఆ నర్రెడ్డి డమ్మీ.
జగన్ అధికారంలోకి రాక ముందు వరకూ చిన్న ‘స్థాయిలో ఉండే కంపెనీ ఆ తర్వాత వేల ఎకరాలు సొంతం చేసుకుంది. అప్పట్లోనే కాదు ఇప్పుడు కూడా అంటే టీడీపీ హయాంలో కూడా. కేబినెట్ ఇప్పుడు భూముల కేటాయింపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రామయపట్నం వద్ద సోలార్ ప్లేట్లు తయారు చేస్తామంటూ ఓ కంపెనీ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ఇండో సోల్ పేరుతో ప్రారంభించింది. పది లక్షల అథరైజ్డ్ క్యాపిటల్‌తో ప్రారంభించింది భూముల కోసమే. ఎలాంటి కార్యకలాపాలు లేవు. కానీ వేల కోట్లు పెట్టుబడులు పెడతామని చెప్పింది. టీడీపీ ప్రభుత్వం అమ్మేసింది. వైసీపీ హయాంలో ఆరోపణలు చేసింది.. దోచుకుంటున్నారని చెప్పింది ఈ భూముల విషయంలోనే.
వైసీపీ హయాంలో పెత్తందారు కంపెనీ
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత షిరిడిసాయి ఎలక్ట్రికల్స్‌కు కడప నగరానికి ఆనుకుని ఉన్న ఐటీ సెజ్ భూములు.కానీ డీ నోటిఫై చేసి 49.8 ఎకరాలను కేటాయించారు. సోమశిల వద్ద కూడా షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ సోమశిల వద్ద 900 మెగావాట్ల ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చింది. అల్లూరి సీతారామరాజుజిల్లా ఎర్రవరం వద్ద 1200 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును షిరిడి సాయి సంస్థకు ప్రభుత్వం నామినేషన్ పద్దతిలో జగన్ ప్రభుత్వం కేటాయించింది. ఇది చట్ట విరుద్ధమని టీడీపీ ఆరోపించింది. విద్యుత్ సంస్థకు తమకు అవసరమైన ట్రాన్స్ ఫార్మర్లు షిరిడి సాయి సంస్థ నుంచే కొన్నాయి. టీడీపీ వచ్చిన తర్వాత కూడా కొంటున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు భూములు కేటాయించారు.
మరి కార్యకర్తలు విమర్శించకుండా ఎలా ఉంటారు ?
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జగన్ బినామీ సంస్థల దోపిడీపై పోరాడారు. చంద్రబాబును.. పార్టీ నేతల్ని కేసులతో వేధిస్తూంటే..తమనే వేధించినంతగా బాధపడ్డారు. రోడ్డెక్కారు. పోరాడారు. ఇప్పుడు అలా చేసిన వారందరినీ చట్టపరంగా అయినా శిక్షించాలని కోరుకుంటున్నారు. బినామీలను ఏరి పారేయాలని అనుకుంటున్నారు. కానీ జరుగుతున్నదేమిటి?. షిరిడి సాయిలాంటి సంస్థకే వేల ఎకరాలు కేటాయిస్తూ ఉంటే.. టీడీపీ కార్యకర్తలకు కడుపు మండిపోదా?. విమర్శించకుండా ఉంటారా?