అసెంబ్లీకి వెళ్తేనే కదా మైక్ ఇస్తారో లేదో తెలుస్తుంది. అసలు వెళ్లకుండా మైక్ ఇవ్వరు అని తమకు తాము చెప్పేసుకుని అసెంబ్లీకి వెళ్లకపోవడం ఏమిటి ? అని వైసీపీలో సామాన్య కార్యకర్తకు వస్తున్న సందేహం. దీనికి ఎవరు సమాధానం చెబుతారో వైసీపీలోనే క్లారిటీ లేదు. సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని అనుకుంటున్నారు. పార్టీ ఓడిపోయాక సోషల్ మీడియాను కాపాడుకునేందుకు అందర్నీ కొంత కాలం పద్దతిగా ఉండాలని కూడా ఎవరూ చెప్పలేదు. చివరికి మరింత రెచ్చిపోయేలా చేసి.. ప్రజాల సానుభూతి కూడా రాకుండా అందర్నీ అరెస్టయ్యేలా చేశారు. ఇవి పార్టీకి కొల్లేటరల్ డ్యామేజ్ చేస్తున్నాయి. ఈ నిర్ణయాలకు కారణం ఎవరు ?
జగన్ రెడ్డికి కనీస రాజకీయ ఆలోచనలు ఉన్నాయని వైసీపీ క్యాడర్ అనుకోవడం లేదు. ఆయనకు ఒకటే తెలుసు. చిన్న పిల్లాడిలా వాళ్లపై ఎలా కక్ష తీర్చుకోవాలి.. వీళ్లపై ఎలా కక్ష తీర్చుకోవాలి… అన్నదే తెలుసు, మిగతా రాజకీయం అంతా సజ్జల రామకృష్ణారెడ్డి నడిపిస్తారు. ఆయన సలహాలతోనే జగన్ నిర్ణయాలు ఉంటాయి. ఇప్పుడు అసెంబ్లీకి వద్దు అని సలహా ఇచ్చింది కూడా ఆయనేనని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అసెంబ్లీలో జగన్ ని టీడీపీ ఎమ్మెల్యేలు కొడతారు అని భయపెట్టారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. గత ఐదేళ్లకాలంలో వైసీపీ చేసిన పనులకు వాళ్లు కొడతారని.. అసెంబ్లీలో ఏం జరిగినా రికార్డులు బయటకు రావని..కేసులు కూడా ఉండవని సజ్జల భయపెట్టినట్లుగా తెలుస్తోంది.
అందుకే జగన్ అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయం తీసుకున్నారు. మరి ఎమ్మెల్యేలనూ ఎందుకు వద్దంటున్నారంటే…. జగన్ వెళ్లకుండా ఎమ్మెల్యేలు వెళ్తే వారికి బాగా మాట్లాడే అవకాశం ఇచ్చి ఫోకస్ అయ్యేందుకు అవకాశం ఇస్తారని అది జగన్ కు ఇష్టం ఉండదని అంటున్నారు. ఈ సలహా కూడా సజ్జలదేనని ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. జగన్ చుట్టూ ఉన్న కోటరీ ఆయన నిర్ణయాలను ప్రభావితం చేస్తూ పార్టీకి మొదటికే మోసం తెచ్చి పెడుతోందని జగన్ ఈ విషయం తెలుసుకోలేకపోతున్నారని అంటున్నారు.
సోషల్ మీడియాను స్లో డౌన్ చేయాల్సిన సజ్జల.. తన కుమారుడిని తప్పించి అందర్నీ ఇరికించేందుకు పెద్ద ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు ఆయన కుమారుడి మెడల్ చుట్టుకుంటోంది. కారణం ఏదైనా కోటరీ మాయలో పడిన జగన్ .. తన పార్టీ పునాదుల్ని పెకిలించుకుంటున్నారు కానీ.. నిజాలేమిటో గుర్తించలేకపోతున్నారు.