టీడీపీ గెలిచినందుకు టీడీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. విచిత్రంగా వైసీపీ ఓడిపోయినందున వైసీపీ క్యాడర్ కూడా సంబరాలు చేసుకున్నారు. కాకపోతే బయటకు కాదు. సోషల్ మీడియాలో తమ సంబరాన్ని చాలా మంది బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాము ఎంతో కష్టపడితే అధికారంలోకి వచ్చాక కనీసం పట్టిచుకోవడం లేదన్న అసంతృప్తే. ఇప్పుడైనా తమను పట్టించుకుంటారన్న ఓ ఆనందం వైసీపీ క్యాడర్లో వ్యక్తమవుతోంది.
అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ నేతలు , కార్యకర్తల్లో ఓ రకమైన నిస్తేజం కనిపిస్తోంది. దీనికి కారణం వాలంటీర్, సచివాలయ వ్యవస్థతో అసలు పార్టీ కార్యకర్తలకు విలువ లేకుండా పోవడమే. ద్వితీయ శ్రేణి నేతలు కూడా చిన్న పని కోసం అయినా వాలంటీర్ల వద్దకు వెళ్లాల్సిందే. ఇది వైసీపీ క్యాడర్లో అసంతృరప్తికి కారణం అయింది. ఇక ఓ మాదిరి స్థాయి నేతలు.. తాము పార్టీ కోసం చాలా పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టుకున్నా.. ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందని అసంతృప్తికి గురవుతున్నారు.
కొంత మంది పనులు చేసినప్పటికీ బిల్లులు అందడం లేదు. గ్రామాల్లో పంచాయతీల అధికారాలు మొత్తం గ్రామ సచివాలయాలకే ఉండటంతో వైసీపీ అధినాయకత్వంపై గ్రామ స్థాయి నాయకత్వం కూడా అసంతృప్తిగా ఉంది. అందుకే క్యాడర్ ను పట్టించుకోవాలన్న సందేశాలు ఎక్కువగా ఆ పార్టీ హైకమాండ్‌కు అందుతున్నాయి. అయితే ఇప్పుడు వైసీపీ హైకమాండ్ పూర్తిగా ఐ ప్యాక్ మాయలో ఉందని.. ఎవరూ మార్చలేరన్న నిర్వేదం కూడా వారిలో కనిపిస్తోంది.