వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత … ఆ పార్టీ, ఈ పార్టీల నుంచి వచ్చిన వారికి… ఆ అవకాశం లేని చోట పార్టీలో ఉన్న వారికి టిక్కెట్లిచ్చారు. అనకాపల్లి ఎంపీగా.. పార్టీ సభ్యత్వం లేని వారికీ చాన్సిచ్చారు. అన్నీ ఒకేసారి ప్రకటించారు. కానీ.. ఇప్పుడు ఏం జరుగుతోంది..? ఆ అభ్యర్థులు తప్ప.. ఎవరూ పార్టీలో ఉండని పరిస్థితి ఏర్పడింది. ఎక్కడా సంప్రదింపులు లేకపోవడం… పార్టీ నేతలను అసలు పరిగణనలోకి తీసుకోకపోవడం.. కేవలం పీకే సర్వేలు, లెక్కలతో అభ్యర్థులను ఖరారు చేయడంతో ఈ పరిస్థితి వచ్చి పడింది. అభ్యర్థుల జాబితా బయటకు వచ్చిన తర్వాత ఇప్పటికే కనీసం 20 మంది నియోజకవర్గ స్థాయి నేతలు గుడ్ బై చెప్పారు. చాలా మంది కార్యకర్తలతో సమావేశాల్లో ఉన్నారు.
కృష్ణా జిల్లాలో వైసీపీ పరిస్థితి కకావికలంగా ఉంది. అనేక మంది రెబల్ అభ్యర్థులు ఉండే అవకాశం కనిపిస్తోంది. ఎంపీ టిక్కెట్ లేకపోతే గన్నవరం టిక్కెట్ ఆశ చూపి.. రాజకీయాలకు దూరంగా ఉంటున్న దాసరి జైరమేష్ సోదరుల్ని పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పుడు వారు రగిలిపోతున్నారు. విజయవాడ తూర్పు నుంచి యలమంచిలి రవి, పెడనలో ఉప్పాల రాంప్రసాద్ ఇద్దరికీ జగన్ హ్యాండిచ్చారు. వారు స్వతంత్రులుగా అయినా బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. గుంటూరు జిల్లాలో జగన్ ఐదుగురు నియోజకవర్గ సమన్వయకర్తలకు మొండిచేయి చూపారు. ఎవరూ జగన్ నిర్ణయమే శిరోధార్యం అనే పరిస్థితి లేదు. ఐదేళ్లు పొన్నూరులో పని చేసుకున్న మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ ఇప్పుడు రగిలిపోతున్నారు. పొన్నూరు, ప్రతిపాడుల్లో వైసీపీ అభ్యర్థుల్ని ఓడిస్తామని సవాల్ చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో కూడా పరిస్థితి చేయి దాటింది. పర్చూరు స్థానాన్ని దగ్గుబాటి వెంకటేశ్వరరావు కి కేటాయిస్తూ జగన్ తీసుకున్న నిర్ణయంతో… ఇప్పటి వరకూ ఉన్న సమన్వయకర్త రామనాథంబాబు టీడీపీలో చేరిపోయారు.
ఉభయగోదావరి జిల్లాల్లో చాలా మంది వైసీపీ నేతలు పాదయాత్ర సమయంలోనే.. ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. అగ్రనేతలెవరూ లేరు. ద్వితీయ శ్రేణి నేతలతోనే ఇప్పటి వరకూ పార్టీని నెట్టుకొస్తున్నారు. చివరికి వారినీ టిక్కెట్ల విషయంలో మోసం చేశారు. పాలకొల్లు టిక్కెట్ నిన్నామొన్నటి వరకు గుణ్ణం నాగబాబుకేనని చెప్పారు. రాత్రికి రాత్రి బాబ్జీ అనే నేతను పార్టీలో చేర్చుకుని టిక్కెట్ ఇచ్చారు. ఆయన కన్నీటి పర్యంతమైన.. జనసేనలో చేరారు. జనసేన తరపున పోటీ చేస్తున్నారు. ఇక విశాఖలో కార్యాలయాన్నే ధ్వంసం చేశారు. విశాఖ సిటీలో ముగ్గురికి జగన్ షాక్ ఇచ్చారు. యలమంచిలి టికెట్ కన్నబాబురాజుకు ఇవ్వడంతో మాజీ సమన్వయకర్తలు ప్రగడ నాగేశ్వరరావు, బొడ్డేడ ప్రసాద్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కోలా గురువులు, దక్షిణా ముర్తి కూడా… వైసీపీకి గుడ్ బై చెప్పారు. వారు టీడీపీతో సంప్రదింపులు జరుపుతున్నారు. వైసీపీని ఓడించడానికి తమ వంతు సాయం చేస్తామంటున్నారు. పరిస్థితి చూస్తే… అనేక నియోజకవర్గాల్లో.. అభ్యర్థులు… క్యాడర్ మొత్తాన్ని దూరం చేసుకుని ఒంటరిగా ఎదురీదాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.