ఎన్నికలకు వెళ్లే ముందు.. తెలుగుదేశం పార్టీ అధినేత.. తన “బోల్డ్” హామీల అమలుతో ప్రజలను బౌల్డ్ చేయడంతో పాటు… ప్రతిపక్షాన్ని “క్లీన్ బౌల్డ్” చేయడానికి.. అసెంబ్లీని వేదికగా చేసుకోబోతున్నారు. అసెంబ్లీకి హాజరు కాకూడదని.. వైసీపీ గతంలోనే నిర్ణయించుకున్నందున.. చంద్రబాబు.. ఈ అవకాశాన్ని ఏ మాత్రం వదులుకునే అవకాశం లేదు. ప్రజలకు తాయిలాల ప్రకటనతో.. వివిధ వర్గాలను ఆకట్టుకునేలా కొత్త కొత్త నిర్ణయాలను… వన్ సైడ్ వాదనతో… నెగ్గించుకునే అవకాశం కనిపిస్తోంది.
నగదు పంపిణి పథకాలకు అసెంబ్లీ ముద్ర..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. తాము గెలిచిన తర్వాత ఇస్తామని ఘనంగా చెప్పుకుంటున్న హామీలన్నింటినీ.. ఏదో రూపంలో చంద్రబాబు ఎన్నికలకు ముందుగానే అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత వైసీపీ వచ్చినా చేయడానికి ఏమీ ఉండదనే భావన ప్రజలకు కల్పించడానికి… పక్కాగా ఏర్పాట్లు చేసుకున్నారు. దీన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అసెంబ్లీని వేదికగా చేసుకోబోతున్నారు. పెన్షన్ల రెట్టింపు దగ్గర్నుంచి.. డ్వాక్రా మహిళలకు రూ. 10వేలు, స్మార్ట్ ఫోన్, రైతులకు రైతు రక్ష పథకంతో పెట్టుబడి సాయం.. సహా.. విభిన్నవర్గాలకు అనేక తాయిలాలపై ఇప్పటికే నిర్ణయాలు తీసుకున్నారు. వీటిని అసెంబ్లీ వేదికగా.. గొప్పగా.. ప్రజలకు చెప్పబోతున్నారు. నిర్ణయాలు మాత్రమే.. కాదు.. లబ్ది కూడా.. ఎన్నికల్లోపు ప్రజలకు అందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల కోడ్ వచ్చినా… ఏ మాత్రం ఇబ్బందుల్లేకుండా… అసెంబ్లీ ద్వారా చేసుకోబోతున్నారు.
కాపు కోటాకూ.. చట్టం ..!
పథకాలు మాత్రమే కాదు.. వివిధ వర్గాల డిమాండ్లను తీర్చే కోణంలోనూ.. ఏపీ ప్రభుత్వం ఈ అసెంబ్లీ సమావేశాలను.. ఉపయోగించుకోబోతోంది. ముఖ్యంగా కాపు రిజర్వేషన్ల విషయంలో ఏపీ ప్రభుత్వానికి ఓ గొప్ప అవకాశం వచ్చింది. అదే కేంద్రం ఇచ్చిన ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి పది శాతం రిజర్వేషన్లు. ఇందులో ఐదు శాతం.. కాపులకు ఇవ్వాలని నిర్ణయించడం.. సంచలనాత్మకం అయింది. దీనిపై పూర్తి స్థాయిలో… అసెంబ్లీలో చర్చ జరిపి చట్టం చేయనున్నారు. అదే జరిగితే.. అది తెలుగుదేశం పార్టీకి మరోసారి కాపు ఓట్లు వెల్లువలా పడే అవకాశం ఉంది. రిజర్వేషన్ల హామీని ఇలా అమలు చేయడం చంద్రబాబుకు కలిసి వచ్చే అవకాశం ఉంది.
వైసీపీ ఎలా వాదన వినిపిస్తుంది..?
వీటన్నింటినీపై.. వైసీపీ తన వాదన వినిపించడానికి అసెంబ్లీనే అసలైన వేదిక. చంద్రబాబు పెడుతున్న పథకాలన్నీ.. తమ పథకాలేనని.. కాపీ కొట్టారని.. వైసీపీ వాదిస్తోంది. కానీ.. అసెంబ్లీలో తమ వాయిస్ వినిపించే లేదు. అలాగే.. కాపు కోటా కూడా.. పూర్తిగా రాజకీయమేనని.. వైసీపీ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. కానీ.. అసెంబ్లీకి రారు కాబట్టి.. వారి వాదన వ్యాలిడ్ కాదు. బయట ఎన్ని ప్రెస్మీట్లు పెట్టినా.. సాక్షిలో పుంఖానుపుంఖాలుగా కథనాలు రాసినా… అవి రాజకీయ కోణంలోనే ఉంటాయి. అసెంబ్లీలో వాదిస్తే.. ఆ ప్రభావం వేరుగా ఉంటుంది. ఎలా చూసినా.. వైసీపీ అసెంబ్లీకి రాకపోవడంతో.. అసలు ఆడకుండానే.. టీడీపీకి వాకోవర్ ఇచ్చేసినట్లవుతుందనే భావన రావడ ఖాయమే. ఇది ఎన్నికల్లో వైసీపీకి తీవ్ర నష్టం జరగనుంది.