జగనన్న ఉన్నప్పుడు నాకు అమ్మఒడి పదిహేను వేల రూపాయలు వచ్చేది. ఇప్పుడేమీ రావడం లేదు అని.. సాక్షి మైక్ ముందు దేవికారెడ్డి అనే చిన్న పిల్లతో చెప్పించారు వైసీపీ నేతలు. ఆ పాపనే జైలు వద్దకు వైసీపీ నేతలు తీసుకెళ్లారు. అక్కడ జగన్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆరేడు కెమెరా యాంగిల్స్ తో ఆ పర్ఫార్మెన్స్ ను షూట్ చేయించుకుని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నారు. మరి ఆ పాప ఎవరు.. అమ్మఒడి రాకపోవడం వల్ల స్కూలుకు వెళ్లలేకపోతోందా అంటే.. ఆ రోజు జగన్ వద్దకు తీసుకెళ్లడానికే ..స్కూల్ కు పంపలేదు. తోసుకునే చాన్స్ ఉన్నా.. నాగార్జున యాదవ్ లాంటి వైసీపీ నేతలు జైలు వద్దకు తీసుకెళ్లారు.
అసలు ఆ పాప అమ్మఒడి గురించి అలా ఎలా చెప్పిందో సులువుగా అర్థం చేసుకోవచ్చు. పదేళ్లు కూడా ఉండని పిల్లకు అమ్మా.. నీ ఫీజు కట్టలేకపోతున్నాం అని చేతకానితనంతో తల్లిదండ్రులు చెప్పుకుంటారా?. ఎన్నికష్టాలున్నా పిల్లలకు మాత్రం చెప్పుకోరు కదా. కానీ ఇక్కడ ఆ పాపతో బట్టీ పట్టించి చెప్పించారు. ఆ పాప కుటుంబానిది తక్కువ స్థాయి కాదు.. ఫీజులు కట్టలేనంత దౌర్భాగ్యమూ లేదు. విజయవాడలో ప్రసిద్ధ కార్పొరేట్ స్కూల్స్ లో ఒకటి అయిన రవీంద్ర భారతి స్కూల్ లో ఆ పాప చదువుతోంది. ఆ స్కూల్లో ఏడాది లక్ష రూపాయల ఫీజు చెల్లించాలి. ఇతర ఖర్చులు ఉంటాయి. అలాంటి స్కూల్స్ లో చదివే వారికి అమ్మఒడి ఇస్తారా?. అమ్మఒడి రాక ఇబ్బంది పడతారా?
సాక్షి టీవీ మీడియా ప్రతినిధులు.. ఆ కుటుంబం మొత్తాన్ని టీవీకి ఎక్కించారు. లక్ష్మణరెడ్డి అనే ఆ పాప దేవికారెడ్డి తండ్రి బంగారు నగల దుకాణంలో పార్టనర్. తల్లి కూడా ఉద్యోగం చేస్తారు. ఆర్థికంగా ఏ లోటూ లేదు. సాక్షి టీవీలో చూపించిన ప్రకారం వారి ఇల్లు కూడా లగ్జరీగానే ఉంది. మరి ఎందుకు ఆ పాపతో ఇన్ని డ్రామాలు ఆడించారు?. ఆ విషయాన్ని బయట పెట్టిన మీడియాపై రివర్స్ లో ఎందుకు ఎదురు దాడి చేశారు?.
పిల్లలతో రాజకీయం ఎప్పటికైనా ప్రమాదకరం. గతంలో ప్రత్యేకహోదా పేరుతో యూనివర్శిటీలు, కాలేజీలకు వెళ్లి విద్యార్థులతో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడించారు. అలా మాట్లాడిన చాలా మంది తమ భవిష్యత్ ను నాశనం చేసుకున్నారు. తమకు ఏమీ తెలియదని వైసీపీ వాళ్లు .. తమ కాలేజీ యాజమాన్యాలు చెప్పమంటే చెప్పామని తర్వాత వారు లబోదిబోమన్నారు. పెద్దయిన తర్వాత ఈ పాప కూడా తన జీవితాన్ని రాజకీయాల కోసం నాశనం చేశారని వైసీపీ నేతలను తిట్టుకునేలా చేసుకుంటున్నారు.