విజయవాడ వరద బాధితులకు కోటి రూపాయల సాయం చేయాలని వైసీపీ నిర్ణయించింది. అయితే ఆ మొత్తం ప్రభుత్వానికి ఇవ్వరట. ఏ రూపంలో సాయం చేయాలన్నదానిపై తాము పార్టీ నేతలతో కలిసి చర్చించి నిర్ణయిస్తామని చెబుతున్నారు. వారు ఇవ్వదల్చుకుంటే.. ఆ కోటి రూపాయలకు తలా ఓ వాటర్ బాటిల్ కూడా రాదు. నిజానికి ఈ రూ.కోటి వైసీపీ కానీ.. జగన్ కానీ ఇస్తారని ఎవరూ అనుకోరు. ఎందుకంటే గతంలో హుదూద్ సమయంలో ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనని కోటి ప్రకటించారు. తర్వాత ఎప్పుడూ ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. ఏమైందంటే.. సాయం రూపంలో పంచేశామని చెప్పుకున్నారు.
ఇప్పుడు కూడా జగన్ రెడ్డి లేదా వైసీపీ రూ. కోటి కాదు రూ. పది కోట్లు ప్రకటించినా దానికి లెక్కా పత్రం ఉండదు. ఎవరికో రెండు వాటర్ బాటిళ్లు ఇస్తున్నట్లుగా ఫోటోలు తీసుకుని రూ. కోటికి మించి సాయం చేసిన జగన్ రెడ్డి దయార్ద్ర హృదయుడు అని పేపర్ లో రాసుకుంటారు. కానీ ఆయన జేబు నుంచి ఆ వాటర్ బాటిళ్ల ఖర్చు కూడా ఉండదు. జగన్ రెడ్డి పిల్లికి కూడా బిచ్చం పెట్టరని వైసీపీలోనే చెప్పుకుంటారు. పార్టీ కార్యకర్తలు లేదా.. ఎవరైనా వచ్చినా వ్యక్తిగతంగా సాయం చేసిన సందర్భమే ఎప్పుడూ లేదు. చావు బతుకుల్లో ఉన్న వాళ్లు ఎవరైనా వచ్చినా మన ప్రభుత్వం వచ్చాకనే అనే డైలాగ్ చెబుతారు.
వరదలకు వచ్చి షో చేసి.. ప్రభుత్వపై విమర్శలు చేసి వెళ్లారు. అందరూ.. రాజకీయం చేసి పోయారు కానీ.. చిన్న సాయమైనా చేసే ప్రయత్నం చేశారా అన్న విమర్శలు ప్రారంభించారు. వీటిని తట్టుకోవడానికే జగన్ రూ. కోటి ప్రకటన చేశారు. వాటిని ఎవరికీ ఇచ్చేది కూడా ఉండదు. రాసుకోవడానికే.