ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ, మీడియా వర్గాల్లోనూ వినిపిస్తున్న చర్చ ఇదే. ఇతర పార్టీల నుంచి వైఎస్సార్సీపీలోకి చేరాలనుకునే నాయకులకు జగన్ ఫిబ్రవరి నెలాఖరు వరకు గడువు ఇచ్చారట.
ఇప్పటికే చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ వైఎస్ఆర్ సీపీలో చేరిన విషయం తెలిసిందే. వీరిద్దరితో పాటు గంటా శ్రీనివాసరావును పార్టీ లోకి లాగడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే దీంతో పాటు గతంలో వైఎస్సార్ సీపీ నుండి టిడిపి కి వెళ్ళిన 20 మంది ఎమ్మెల్యేలలో దాదాపు ఆరుగురు తిరిగి వైఎస్ఆర్ సిపి లోకి రావాలని ప్రయత్నిస్తున్నారని రిపోర్టులు వస్తున్నాయి. ఆ మధ్య చంద్రబాబు నాయుడు చేసిన ఆపరేషన్ ఆకర్ష లో 20 మంది దాకా ఎమ్మెల్యేలు వైఎస్సార్సీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం, అలా చేరిన వాళ్ళలో కొందరు మంత్రి పదవులు దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే మరికొందరికి మాత్రం టిడిపి లో చేరాక పెద్దగా ప్రయోజనం కలగలేదు. అప్పటికే స్థానికంగా ఉన్న టిడిపి నేతలతో వీరికి ఇబ్బందులు రావడం, పలు విషయాలలో వీరిని టిడిపి క్యాడర్ లెక్క చేయకపోవడం జరిగింది. అలాంటి వాళ్ళలో కొందరు ఇప్పుడు టిడిపిని వీడి మళ్లీ జగన్ చెంతన చేరడానికి ప్రయత్నిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మొత్తంగా కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర ప్రాంతాల నుండి ఆరుగురు ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సిపి తో టచ్ లోకి వచ్చారు అని వార్తలు వస్తున్నాయి.
అయితే గతంలో వైఎస్సార్ సీపీ నుండి వెళ్లిపోయిన నాయకులైనా, లేదా కొత్తగా వైఎస్సార్సీపీలో చేరుతున్న నాయకులు అయినా ఫిబ్రవరి నెలాఖరులోగా చేరాలని జగన్ గడువు పెట్టినట్టుగా రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఫిబ్రవరి ఆఖరుకల్లా చేరిక లను పూర్తి చేసి, మార్చి నెల మొదటి వారం నుండి జగన్ సర్దుబాట్లు మొదలుపెడతారట. అంటే ప్రతి నియోజకవర్గంలోనూ ఇదివరకే టికెట్ ఆశిస్తున్న నాయకులకు, ఇప్పుడు కొత్తగా వచ్చి చేరిన నాయకులకు ఇబ్బంది కలగకుండా సర్దుబాట్లు చేస్తారట. మరి జగన్ సర్దుబాట్లు ఎంతవరకు ఫలిస్తాయో అన్నది ఎన్నికలయ్యేదాకా వేచి చూడాల్సిందే.