ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. ఒకటి,రెండు మున్సిపాలిటీలు తప్ప..అన్నింటినీ కైవసం చేసుకోవడం ఖాయం అయింది. ఎక్కడా కనీసం తెలుగుదేశంపార్టీ గట్టి పోటీ ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి గట్టిగా నిలబడటం.. ఆయన కూడా అభ్యర్థిగా నిలబడటంతో.. తాడిపత్రి మున్సిపాల్టీలో మాత్రం టీడీపీ గెలిచింది. కడప జిల్లా మైదుకూరులోనూ టీడీపీ పూర్తి మెజార్టీ రాకపోయినా అత్యధిక స్థానాల్లో గెలిచింది.ఇక ఫలానా మున్సిపాల్టీలో టీడీపీ ప్రభావం చూపించింది అని చెప్పుకోలేని పరిస్థితి. కార్పొరేషన్లలోనూ అదే పరిస్థితి. ఏలూరులో కౌంటింగ్ చేయలేదు. మిగతా పదకొండు కార్పొరేషన్లలోనూ వైసీపీ హవా కనిపిస్తోంది.
రాజధాని ప్రాంతమైన గుంటూరు, విజయవాడ నగర పాలక సంస్థల్లోనూ వైసీపీ ఫ్యాన్ గాలి ఉద్ధృతంగా ఉంది. గుంటూరులో మొత్తం 57 కార్పొరేషన్ వార్డులు ఉండగా… అందులో 43 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మరొకటి ఇప్పటికే ఏకగ్రీవం అయింది. తెలుగుదేశం పార్టీ కేవలం తొమ్మిది డివిజన్లను మాత్రమే గెల్చుకుంది. జనసేన రెండు డివిజన్లు, వైసీపీ రెబల్స్ రెండు డివిజన్లు గెల్చుకున్నారు. విజయవాడతో పాటు స్టీల్ ప్లాంట్ ఉద్యమం సాగుతున్న విశాఖలోనూ వైసీపీ హవా కనిపిస్తోంది. పూర్తిగా ఫలితాలపై సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
కోస్తా ప్రాంతంలోజనసేన పార్టీ చీల్చిన ఓట్లు వైసీపీకి బాగా ఉపయోగపడ్డాయి. టీడీపీ పరాజయానికి బాటలు వేశాయి. గుంటూరు సహా అనేక కార్పొరేషన్లలో జనసేన చీల్చిన ఓట్లు కీలకంగా మారాయి. మొత్తంగా వైసీపీకి జనసేన- బీజేపీ కూటమి పోటీ.. గొప్పగా కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. బీజేపీ ఎక్కడాఒక్క వార్డు గెలుచుకున్నట్లుగా సమాచారంలేదు.కానీ జనసేసన మాత్రం… కోస్తాలోని మున్సిపాల్టీల్లో ఒక్క వార్డు గెలుచుకోవడమో… లేకపోతే.. ఓటు షేర్ ఎక్కువగా తెచ్చుకోవడమో చేసింది. మొత్తంగా అయితే.. వైసీపీ దున్ని పారేసిందని చెప్పాలి. 151 సీట్లతో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన వైసీపీ… రెండేళ్లలో పెద్దగా వ్యతిరేకత ఏమీ మూటుగట్టుకోలేదని.. ఆ హవా కొనసాగుతోందని నిరూపించుకుంది. పంచాయతీ ఎన్నికల్లోనూ అదే తరహా ఫలితాలు వచ్చాయి. రేపు .. పరిషత్ ఎన్నికల్లో అదే తరహాఫలితాలు వచ్చే అవకాశం ఉంది.