ఆంధ్రప్రదేశ్ కు భారతీయ జనతా పార్టీ అన్యాయం చేసిందని… ప్రధాని మోదీ నమ్మించి మోసం చేసిందని ఆరోపిస్తూ.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు .. శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇందులో కేంద్రం ఇచ్చిన నిధులు..ఇవ్వాల్సిన నిధులు.. నెరవేర్చాల్సిన హమీలు.. సహా సర్వం వివరాలు ఉంటున్నాయి. దీనిపై… భారతీయ జనతా పార్టీ అధికారికంగా ఇంత వరకూ స్పందించలేదు. అవి నిజాలు కాదో చెప్పే ప్రయత్నం చేయలేదు. ఓ రకంగా స్పందించాల్సిన బీజేపీ నీళ్లు నమిలింది. కానీ వైసీపీ మాత్రం చురుగ్గా స్పందిస్తోంది. ఆనం రామనారాయణరెడ్డి.. చంద్రబాబు వైట్ పేపర్స్ కు పోటీగా తాము బ్లాక్ పేపర్స్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు.
ఆనం ప్రకటనను.. సాక్షి మీడియా కూడా హైలెట్ చేసింది. దీన్ని చూసి.. ఆశ్చర్య పోవడం ఇతర పార్టీల నేతల వంతయింది. వైట్ పేపర్స్ రిలీజ్ చేసింది.. బీజేపీకి.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా. అందులో ఏమైనా తప్పులుంటే.. వాళ్లు సమర్ధించుకునేందుకు కౌంటర్ ఇస్తారు. కానీ.. బీజేపీని సమర్థించడానికి వైసీపీకి ఎందుకంత తొందర అనేదే ఆ ఆశ్చర్యానికి కారణం. బీజేపీకి అండగా .. వైసీపీ ఉందన్న కారణంగానే.. కేంద్రం ఏపీకి ఇవ్వాల్సిన ప్రత్యేకహోదా, ప్రాజెక్టులు, నిధులను.. నిలిపి వేసిందని.. రాజకీయంగా.. టీడీపీ వల్ల జరిగే నష్టం.. వైసీపీతో భర్తీ అవుతుందన్న భరోసాతోనే బీజేపీ ఏపీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. దీన్ని నిజం చేసేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విభజన హామీల విషయంలో .. బీజేపీని విమర్శించడం ఎప్పుడో మానేసింది.
అదే సమయంలో ధర్మపోరాట దీక్షలకు పోటీగా… టీడీపీపైనే వంచన దీక్షలు చేస్తోంది. తాజాగా… వైట్ పేపర్స్ విషయంలోనూ.. బీజేపీ ఏపీకి సాయం చేయకపోవడం తప్పేమి కాదన్నట్లుగా.. వ్యవహరిస్తూ.. బ్లాక్ పేపర్లు విడుదల చేస్తామనడం.. హాట్ టాపిక్ గా మారింది. ఇవే… బీజేపీ, వైసీపీ మధ్య ఉన్న బంధాన్ని గుర్తు చేస్తున్నాయంటున్నారు. దీన్ని వైసీపీ నేతలు ఎలా తిప్పికొడతారో మరి..!