రఘురామకృష్ణంరాజు వైసీపీ పెద్దలకు తలనొప్పి తీసుకు వస్తున్నారు. జగన్‌ను పూచిక పుల్లలా తీసి పడేసి.. తన వల్లనే ఎమ్మెల్యే సీట్లు వచ్చాయన్నట్లుగా మాట్లాడుతూండటంతో.. ఆయనపై ఏం చర్యలు తీసుకోవాలన్నదానిపై వైసీపీ తర్జన భర్జన పడుతోంది. మామూలుగా ఆయన వ్యాఖ్యలపై స్పందించకుండా ఉంటే సరిపోయేది. కానీ ఎమ్మెల్యే ప్రసాదరాజుతో వ్యాఖ్యలు చేయించడంతో… ఆయన కులం కోణం వెలుగులోకి తెచ్చారు. వైసీపీ చేసే కుల రాజకీయాలను బయట పెట్టారు. తమ కులంలో చిచ్చు పెట్టవద్దని ఘాటుగా మాట్లాడటంతో వైసీపీలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీంతో అంబటి రాంబాబు తెరపైకి వచ్చి రఘురామకృష్ణంరాజు తేడా మనిషి అని.. ఎప్పుడూ ఏదో కామెంట్లు చేస్తూంటారని.. సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని.. చెప్పుకొచ్చారు.
సాధారణంగా ఎవరైనా.. ఇలాంటి విమర్శలు చేస్తే.. వైసీపీ నుంచి ముందుగా ఒకే రెడీమేడ్ విమర్శ వస్తుంది. అదే .. టీడీపీకి అమ్ముడుబోయారని. అది బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ కావొచ్చు… ఆస్పత్రిలో వైద్యం చేసే డాక్టర్ సుధాకర్ కావొచ్చు. ఎవరైనా.. తెలుగుదేశం పార్టీకి అమ్ముడుబోయారని.. చంద్రబాబు అలాంటి విమర్శలు చేయిస్తున్నారని విమర్శలు గుప్పించేవారు. కానీ ఇప్పుడు రఘురామకృష్ణంరాజు విషయంలో మాత్రం.. అలాంటి విమర్శలు చేయలేకపోతున్నారు. ఆయన మరిన్ని తీవ్రమైన ఆరోపణలు చేస్తారన్న ఉద్దేశంతోనే ఆయనను చూసీ చూడనట్లుగా ఉండాలని భావిస్తున్నారు. కానీ గురి తప్పి.. ఇప్పుడా వివాదం పెద్దదయ్యేలా ఉంది.
సీఎం జగన్ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదన్న కారణంతోనే బయట వ్యాఖ్యలు చేస్తున్నానని పదే పదే రఘురామకృష్ణంరాజు చెబుతున్నారు. ఇంత గొడవ జరిగిన తర్వాత రఘురామకృష్ణంరాజుకు పిలిచి.. జగన్ అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి ఉండదు. జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ దానికి పూర్తి విరుద్ధం. ఇప్పుడు ఆయన ధిక్కరించే ఎవర్నీ.. బుజ్జగించే మూడ్‌లో లేరు. అయితే వేటు వేయడం.. లేకపోతే… అలా వదిలేయడమే. కానీ రఘురామకృష్ణంరాజు మాత్రం… సైలెంట్‌గా ఉండే అవకాశాల్లేవు. అందుకే ఇప్పుడు ఏం జరుగుతుందోనని వైసీపీలో ఉత్కంఠ ఏర్పడుతోంది.