రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ వైకాపా ఈరోజు ఆంద్రప్రదేశ్ రాష్ట్ర బంద్ కి పిలుపునివ్వడంతో తెల్లవారు జాము నుండే వైకాపా నేతలు, కార్యకర్తలు అన్ని జిల్లాలో బస్సు డిపోల వద్దకు చేరుకొని బస్సులను బయటకి రానీయకుండా అడ్డు పడుతున్నారు. దానితో చాలా బస్సులు దిపోలకే పరిమితమయి పోయాయి. కొన్ని జిల్లాలలో పోలీసులు రక్షణతో బస్సులను నడుపుతున్నారు. రక్షా బంధన్ పండుగ రోజున బంద్ నిర్వహిస్తుండటంతో దూర ప్రాంతాల నుండి వచ్చినవారు బస్సులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ బంద్ ద్వారా వైకాపా రాష్ట్ర ప్రభుత్వానికి తన సత్తా చాటి, ప్రత్యేక హోదా విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలని ఉవ్విళ్ళూరుతోంది. అందుకే ఈరోజు బంద్ ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎలాగయినా విజయవంతం చెయ్యాలని పట్టుదలగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా నేతలు, కార్యకర్తలు అందరూ ఈ బంద్ లో పాల్గొంటున్నారు. ఈ బంద్ కి వామపక్షాలు కూడా మద్దతు ఇస్తున్నాయి. కానీ వైకాపా కంటే మొదటి నుండి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీ, నటుడు శివాజీ అధ్యక్షతన దాని కోసమే ఏర్పడిన ప్రత్యేక హోదా సాధన సమితి ఈ బంద్ కి మద్దతు ప్రకటించకపోవడం విశేషం. తెదేపా, వైకాపాల మధ్య సాగుతున్న ఆధిపత్యపోరులో ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రం నలిగిపోతోందని శివాజీ అన్నారు.బహుశః అందుకే ప్రత్యేకహోదా సాధన సమితి ఈ బంద్ కి దూరంగా ఉన్నట్లుంది.