ఏప్రిల్ పదకొండో తేదీన పోలింగ్ ముగిసినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమదే ప్రభుత్వమన్న నమ్మకంతో ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రశాంత్ కిషోర్… కంగ్రాట్స్ చెప్పి.. సీఎం జగన్మోహన్ రెడ్డి అనే నేమ్ ప్లేట్ కూడా తయారు చేయించి ఇచ్చి వెళ్లారు. ఇప్పుడు.. వైసీపీ నేతలు మరింత ముందడుగు వేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా మే ఇరవై ఆరో తేదీన ప్రమాణస్వీకారం చేయబోతున్నట్లుగా ప్రకటించారు. హైదరాబాద్‌లోని వైసీపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబు… జూన్ ఎనిమిదో తేదీ వరకూ తానే ముఖ్యమంత్రినని చెప్పడాన్ని తప్పుపట్టారు. ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం కాయంగా కాబట్టి… ఫలితాలు వచ్చిన వెంటనే.. ఇరవై ఆరోతేదీన జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని.. అలాంటప్పుడు.. జూన్ ఎనిమిదో తేదీ వరకూ…చంద్రబాబు ఎలా సీఎంగా ఉంటారని ప్రశ్నించారు.
సజ్జల రామకృష్ణారెడ్డి.. జగన్ కోటరీలో అత్యంత ముఖ్యుడు కాబట్టి.. ఈ విషయంలో.. వైసీపీలో చర్చ జరిగిన తర్వాతే నిర్ణయం తీసుకుని ఉంటారని మీడియా వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే మంత్రివర్గ కూర్పుపై కూడా చర్చ జరిగిందని… బయట ప్రచారం జరుగుతోంది. దీనిపై.. వైసీపీ నేతలు ఎక్కడా బహిరంగంగా మాట్లాడటం లేదు. అయితే.. ఎన్నికల్లో పోటీ చేసిన కొంత మంది సీనియర్ నేతలు మాత్రం… తమకు కీలక శాఖ దక్కుతుందని అనుచరులతో చెప్పి సంబర పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి.. పోలింగ్ రోజు మీడియాతో మాట్లాడినప్పుడు… గెలుపు, ప్రమాణస్వీకారంపై పెద్దగా మాట్లాడలేదు.
గెలుస్తామని ధీమా వ్యక్తం చేసిన తర్వాత మీడియా ప్రతినిధులు ప్రమాణస్వీకారం ఎప్పుడు చేస్తారని ప్రశ్నించినప్పుడు.. అంతా దేవుడి దయ అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు మాత్రం తేదీ కూడా ఫిక్స్ చేసుకున్నారు. మరో నెల రోజులు ఉంది కాబట్టి.. జగన్ విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత కేబినెట్‌ను కూడా డిసైడ్ చేసుకుంటారన్న ప్రచారం వైసీపీలో జరుగుతోంది.