వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తలకు ఏడుపు ఒక్కటే తక్కువ కాదు.. అది కూడా వచ్చేస్తోంది. వరసుగా… టిక్కెట్లు దక్కని వారంతా… ఏడుపు మొహాలు పెట్టేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తల ముందు కన్నీళ్లు పెట్టుకున్న ఘటనలు చాలా ఉన్నాయి. కొన్ని బయటకు వచ్చాయి.. చాలా మంది బయటకు రాలేదు. ఇలాంటి నేతల్లో ఎక్కువగా రిజర్వుడ్ నియోజకవర్గాల నేతలు ఉన్నారు.
డబ్బులిస్తే జగన్ ఎవరికైనా టిక్కెట్ ఇచ్చేస్తారా..?
ఇప్పటి వరకూ పార్టీ కోసం పని చేసిన వారిని చివరి క్షణంలో పక్కన పెట్టేసి.. ఆర్థిక స్థోమతనే ప్రధాన అర్హతగా చెప్పుకుని… తమ తమ సీట్లు ఎసరు పెట్టేందుకు కొంత మంది ముందుకు రావడమే అసలు కారణం. ఇటీవలి కాలంలో… అనేక మంది పాత, కొత్త నేతలు.. వైసీపీలో చేరుతున్నారు. చేరే వాళ్లలో టిక్కెట్లు ఇవ్వాలనుకునే వాళ్లను ముందుగానే పీకే బృందం ఇంటర్యూ చేస్తోంది. ఆర్థిక స్థోమతను ఆరా తీస్తోంది. ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టగలిగే సామర్థ్యం ఉందా లేదా.. అని పరిశీలిస్తోంది. ఖర్చు పెట్టగలమని నిరూపించి.. డిపాజిట్ చేసిన వారికి టిక్కెట్లు ఖరారు చేస్తున్నారు. ఇలాంటి ఫైనాన్షియల్ పార్టీల దెబ్బకు …తమ ఐదేళ్ల కష్టం.. పార్టీ కోసం చేసిన ఖర్చు అంతా..కొట్టుకుపోతూంటే… ఆ నేతలు తట్టుకోలేకపోతున్నారు. నిజానికి.. వారు ఇప్పుడు వచ్చి టిక్కెట్ ఇస్తే పెడతామంటున్న ఖర్చు కన్నా.. ఎక్కువ ఈ ఐదేళ్లలో పెట్టామనేది.. ఆ నేతల భావన. అందుకే.. వ్రతం చెడిన ఫలితం దక్కడం లేదని.. వారు కన్నీరు మున్నీరవుతున్నారు.
ఇప్పటి వరకు పెట్టిన ఖర్చు, పడిన కష్టం .. జగన్ పాలేనా..?
వైసీపీలో టిక్కెట్లు దక్కని వారు.. చాలా మంది.. తమ ఆర్థిక స్థితిని చూసే ఇవ్వలేదని.. నేరుగానే ఆరోపణలు చేశారు. వారు చెప్పిన మాటలను.. టీడీపీ నేతలు ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. జగన్ డబ్బుతోనే రాజకీయం చేస్తున్నారని.. మండి పడుతున్నారు. వీరి మాటలకు.. టిక్కెట్లు మిస్సయిన వైసీపీ మాజీ సమన్వయకర్తల కన్నీళ్లు.. సాక్ష్యంగా నిలుస్తున్నాయంటున్నారు. ఓడిపోవడానికి.. గెలవడానికంటే ముందే వారికి అసలైన ఓటమి వచ్చేస్తోంది. పార్టీ టిక్కెట్ వస్తుందని… ఐదేళ్ల పాటు… పార్టీని నియోజకవర్గంలో తమ భుజాల మీద మోస్తే.. చివరికి.. వారికి పార్టీ అధ్యక్షుడు బలమైన నేతలు కాదని.. హ్యాండిచ్చేశారు. అంటే.. టిక్కెట్ అవకాశం వస్తుందని… వారు ఆస్తులు అమ్మి.. అప్పులు చేసి.. పార్టీని నడిపించారు. కానీ.. చివరికి… ఆ ఖర్చు అంతా బూడిదలో పోసిన పన్నీరయింది. పార్టీ కోసం పడిన కష్టం అంతా.. తమకు కాకుండా పోతోంది. అందుకే.. వారు అలా కన్నీటి పర్యంతమవుతున్నారు.
రాజకీయాల్లో జగన్ తెచ్చిన మార్పు ఇదేనేమో..?
“ఓడిన వాళ్లు కౌంటింగ్ హాల్లో ఏడుస్తారు.. గెలిచిన వాళ్లు ఇంటికెళ్లి ఏడుస్తారు..” ఎన్నికల్లో ధనం ప్రభావం విస్త్రతమయ్యాక… ఈ మాట రాజకీయాల్లో సాధారణం అయిపోయింది. ఈ ఏడుపు… ఎన్నికలు అయిన తర్వాతే.. ఇప్పటి వరకూ ఉండేది. కానీ.. ఇప్పుడు వైసీపీ అధినేత పుణ్యమాని ఎన్నికలకు ముందే వచ్చేస్తోంది. టిక్కెట్ల దగ్గరే వచ్చేస్తోంది. ఇది రాజకీయాల్లో జగన్ తెచ్చిన మార్పు అనుకోవాలేమో..?