భవన నిర్మాణ కార్మికుల కోసం లాంగ్ మార్చ్ చేసిన.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కౌంటర్‌గా.. వ్యక్తిగత విమర్శలతో.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విరుచుకుపడుతోంది. ఇసుక సమస్య గురించి మాట్లాడకుండా… పవన్ పై వ్యక్తిగత దాడికి దిగుతున్నారు. పవన్ విమర్శలతో చురుకుపుట్టిందేమో కానీ.. ఉదయం నుంచే.. వైసీపీకి చెందిన కాపు నేతలు.. మీడియా ముందుకు వచ్చి.. పవన్ కల్యాణ్‌ను వ్యక్తిగతంగా విమర్శించడం ప్రారంభించారు. లాంగ్ మార్చ్‌కు ముందు చేసిన విమర్శల్నే రిపీట్ చేస్తూ.. ఇప్పుడు కొత్తగా.. స్వామి భక్తిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. విజయసాయిరెడ్డి.. ట్విట్టర్లోనూ..నేరుగా.. పవన్ కల్యాణ్‌పై వ్యక్తిగత విమర్శలు చేసినప్పుడు..నవ్వుకున్న మంత్రులు.. ఇప్పుడు పవన్ కల్యాణ్.. విజయసాయిరెడ్డిపై అలాంటి వ్యాఖ్యలే చేయగానే… ఉలిక్కి పడ్డారు. విజయసాయిరెడ్డిని అంతలేసి మాటలంటారా అంటూ.. పవన్ పై తిట్ల వర్షం ప్రారంభించారు.
కాలేజీలు నడుపుతూ.. విద్యావేత్తగా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చిన మంత్రి అవంతి శ్రీనివాస్.. తన బ్యాక్ గ్రౌండ్‌కు తగ్గట్లుగా ఎప్పుడూ రాజకీయాలు చేయలేదు. ఇప్పుడూ కూడా.. పవన్ కల్యాణ్‌కు కౌంటర్ ఇచ్చే క్రమంలో.. ఔరా అనిపించుకునే వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో కేసులు సహజమేనని.. చెప్పుకొచ్చారు. విజయసాయిరెడ్డి.. సూట్ కేసులు కంపెనీలు పెట్టి జైలుకెళ్లడం తప్పేం కాదన్నట్లుగా.. అవంతి శ్రీనివాస్.. సర్టిఫికెట్ ఇచ్చేందుకు వెనుకాడలేదు. అంతే కాదు.. జగన్ ని గెలిపించడం ద్వారా ఆయనపై ఉన్నవి తప్పుడు కేసులని ప్రజలు తీర్పేశారని.. వంచన చేసేసుకున్నారు. సినిమాల్లో పవన్ కల్యాణ్ సంపాదించిన సొమ్మును భవన నిర్మాణ కార్మికులకు ఇవ్వాలనే విచిత్రమైన డిమాండ్‌ను కూడా చేశారు. సభ మొత్తంలో పవన్ కల్యాణ్ ఎక్కడా కాపు నాయకత్వం గురించి ప్రస్తావించలేదు.. కానీ.. అవంతి మాత్రం.. పవన్ ఒక్కడేనా.. కాపు నాయకుడు.. అని ప్రశ్నించారు. కాపు యువతను పవన్ రెచ్చగొడుతున్నారనే విమర్శలు కూడా చేశారు.
ఇక అంబటి రాంబాబు కూడా.. అదే తరహా విమర్శలు చేశారు. జగన్మోహన్ రెడ్డి అద్బుత పాలన మూర్ఖులకు కనిపించడం లేదని మండిపడ్డారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడొద్దని హెచ్చరించారు. మరో నేత ద్రోణంరాజు శ్రీనివాస్ కూడా.. అసలు విషయం వదిలేసి.. పవన్ కల్యాణ్ వెనుక ఎవరున్నారో చెప్పాలన్న లాజిక్ తీసుకొచ్చారు. దానితో ఆగలేదు. నీ వెనుక ఎవరున్నారో చెప్పు. నీ వెనుక దావుద్ ఇబ్రహీం ఉన్నాడా?… అంటూ కంట్రోల్ తప్పిపోయారు. ప్రభుత్వాన్ని విమర్శించిన పవన్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. పవన్ కల్యాణ్‌ను వ్యక్తిగతంగా తిట్టి అసలు సమస్యను పూర్తిగా పక్కదోవ పట్టించే ప్రయత్నాన్ని వైసీపీ నేతలు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.