తెలుగుదేశం అధికారం చేపట్టి రెండు నెలలు దాటింది. ఈ రెండు నెలల్లో ఏపీ పూర్తిగా మారిపోయింది. రాజధాని ఏది అన్న సమస్య పరిష్కారం అయింది. కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు తరలి వస్తున్నారు. స్వయంగా ఏపీ కోసం టాటా సంస్థల చైర్మనే పెట్టుబడులు ఆకర్షించేందుకు తన వంతు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. రిలయన్స్ నుంచి ఫాక్స్ కాన్ వరకూ గతంలో పెట్టుబడులు పెట్టాలనుకున్న సంస్థలన్నీ ఏపీకి వస్తున్నాయి. అయితే చేసిందంతా చేసి ఇప్పుడు వైసీపీ క్రెడిట్ కోసం వస్తోంది. వచ్చే రెండేళ్ల పాటు వచ్చే పెట్టుబడులన్నీ తమ కష్టమేనని … క్రెడిట్ టీడీపీ తీసుకుంటోందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెరపైకి వచ్చేశారు.
ఐదేళ్ల పాటు వైసీపీ ఏం చేసింది ?
వైసీపీ అధికారంలో ఐదేళ్ల పాటు ఉంది. అంతకు ముందు ఐదేళ్ల పాటు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పెట్టుబడుల ఫ్రెండ్లీ రాష్ట్రంగా తీర్చి దిద్దింది. దేశంలోనే అతి పెద్ద ఎఫ్డీఐ కియా రూపంలో వచ్చింది. ఉత్పత్తి కూడా ప్రారంభించింది. కొన్ని లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి. వాటన్నింటినీ ముందుకు తీసుకెళ్తే ఈ పాటికి పారిశ్రామికంగా ఏపీ ఎంతో ముందు ఉండేది. కానీ వైసీపీ ఏం చేసింది. చివరికి శంకుస్థాపన కూడా చేసుకున్న కట్ డ్రాయర్ల ఇండస్ట్రీ జాకీని కూడా తరిమేశారు. కానీ ఇప్పుడు పెట్టుబడులు మా వల్లే వస్తున్నాయంటూ క్రెడిట్ కోసం వచ్చేస్తున్నారు.
శ్రీసిటీలో ప్రారంభమైన కంపెనీలు టీడీపీ హయాంలో ప్రతిపాదనలే
చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు వచ్చిన ప్రతిపాదనలు.. జరిగిన ఒప్పందాల కారణంగా ఏర్పాటైన పరిశ్రమల్నే … చంద్రబాబు ప్రారంభించారు. చంద్రబాబు ప్రారంభించిన పరిశ్రమల్లో ఒక్కటి కూడా వైసీపీ రెక్కల కష్టంతో వచ్చిన పరిశ్రమ లేదు. ఆ విషయం అమర్నాథ్కు తెలుసు. దావోస్ కు వెళ్తే చలి వేస్తుందని చెప్పే ఆయన.. పెద్ద ప రిశ్రమలతో ఉపయోగం లేదని.. ఫిష్ ఆంధ్రా స్టాల్స్ బెటరని చెప్పే జగన్ వంటి నేతలు.. ఏపీకి పెట్టుబడులు తెచ్చారంటే ఎవరైనా నమ్ముతారు. ఉన్న పెట్టుబడుల్ని వెళ్లగొట్టారంటే ఎవరైనా నమ్ముతారు.
అమరరాజా పాపం చాలు … క్షమించకుండా ఉండటానికి !
అమరారాజా తెలంగాణలో పది వేలకోట్లు పెట్టుబడి పెడుతోంది. ఆ పెట్టుబడి ఎక్కడిది.. ఏపీది. చిత్తూరూ జిల్లాది. తమ ప్రాంత ప్రజల ఉపాధి కోసం అమెరికా నుంచి వచ్చి పరిశ్రమలు పెట్టింది గల్లా కుటుంబం. అలాంటిది రాజకీయ కారణాలతో వేధించి వారిని పొరుగు రాష్ట్రానికి వెళ్లేలా చేశారు. ఇలాంటివి చెప్పుకుంటే.. .. గుర్తు చేసుకుంటే రాష్ట్ర ప్రజల రక్తం మరిగిపోతుంది. అయినా తగుదునమ్మా అంటూ క్రెడిట్ కోసం వచ్చేస్తున్నారు… ఏ మాత్రం సిగ్గుపడకుండా !