గడచిన నాలుగేళ్లుగా అబద్ధాలు, మోసాలు, దారుణాలు చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారని ఏపీ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఇలాంటి వ్యక్తిని పొరపాటున కూడా మరోసారి ఎన్నుకోవద్దని జగన్ అన్నారు. ఒకవేళ మళ్లీ ఎన్నుకుంటే విశ్వసనీయతకు అర్థం ఉండదనీ, రాజకీయ వ్యవస్థలో విలువలు అనేవి ఉండవని జగన్ చెప్పారు. కర్నూలు జిల్లాలో జగన్ పాదయాత్ర కొనసాగుతోంది. 14వ రోజున బేతంచర్లకు జగన్ యాత్ర చేరుకుంది. ఇక్కడ ఏర్పాటైన సభలో ఆయన ప్రసంగించారు. సినిమాల్లో హీరో మనకు నచ్చుతాడనీ, 13వ రీలు వరకూ హీరో నానా కష్టాలూ పడతాడనీ, న్యాయం కోసం నిలబడతాడనీ, 14వ రీల్లో హీరోకి దేవుడి సాయం అందుతుందనీ, విలన్ ను ఫుట్ బాల్ ఆడుకుంటాడని చెప్పారు. అలాంటి హీరో మనకు నచ్చుతారన్నారు.
ప్రస్తుతం ఉన్న వ్యవస్థ మారకపోతే అవహేళన పాలౌతుందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. అడ్డగోలుగా హామీలు ఇస్తూ.. పదవుల కోసం ప్రజల్ని ఇలానే మోసం చేస్తారంటూ మండిపడ్డారు. ఇలాంటివారిని వదిలేస్తే… అధికారం కోసం రేప్పొద్దున్న లేనిపోని హామీలు ఇస్తారని జగన్ చెప్పారు. ప్రతీ ఇంటికీ ఒక కిలో బంగారం ఇస్తామని చెప్తారనీ, ప్రతీ ఇంటికీ మారుతీ కారు కూడా ఇస్తామంటూ హామీ ఇస్తారంటూ ఎద్దేవా చేశారు. ఆయన నాలుగేళ్ల పాలనలో ఏ ఒక్కరికీ మేలు జరగలేదని జగన్ అన్నారు. ఆడవాళ్లని, అవ్వ తాతల్ని, అక్క చెల్లెళ్లను.. ఇలా అందర్నీ మోసం చేశాడన్నారు. ఇన్ని దారుణాలు, అబద్ధాలు, మోసాలు చేసిన వ్యక్తి ఇవాళ్ల ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడని మండిపడ్డారు. మళ్లీ ఇలాంటి వ్యక్తిని పొరపాటున కూడా ఎన్నుకోవద్దని ప్రజలను ఉద్దేశించి జగన్ అన్నారు! ఇలా ఆద్యంతం చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తూనే ప్రసంగం సాగింది.
ఆరోపణలూ విమర్శలూ వరకూ ఓకే..! రేప్పొద్దున్న ప్రతీ ఇంటికీ కిలో బంగారం ఇస్తారని చంద్రబాబు చెబుతారనీ, మారుతీ కారు ఇస్తారని హామీలు ఇస్తారని జగన్ ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నారు. ఇంతకీ.. టీడీపీ ఇవ్వబోయే హామీలు ఇలా ఉండొచ్చనే ప్రస్థావనే అనవసరం కదా! వాళ్లు ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారో అనే చర్చ జగన్ ప్రసంగంలో ఎందుకు రావాలి..? ఇదొకటే కాదు, వృద్ధాప్య పింఛెను విషయంలో కూడా ఇంతే. తాను రూ. 2000 ఇస్తానని ప్రకటించాక, చంద్రబాబు దాన్ని పెంచేసినా పెంచేస్తాడనీ ఈ మధ్య సభలో తరచూ చెబుతూ వస్తున్నారు. చంద్రబాబును ఎద్దేవా చేయడానికే ఇలా మాట్లాడుతున్నా… టీడీపీ మేనిఫెస్టో ఇలా ఉండబోతుందా అనేది అనే ఆలోచన ప్రజలకు ఇస్తున్నట్టుగా ఉంది! ఆ దిశగా ఆలోచింపజేయాల్సిన అవసరం వైకాపాకి లేదు కదా! నిజంగానే టీడీపీ రేప్పొద్దున్న ఈ కార్లూ, బంగారాలు తరహా హామీలు ఇస్తే… ఆరోజే విమర్శలు చెయ్యొచ్చు. ‘ఇలాంటి హామీలు ఇస్తున్న టీడీపీకి మరోసారి అధికారం ఇవ్వొద్ద’ని చెప్పొచ్చు. మూడు పేజీలకు మించకుండా వైకాపా మేనిఫెస్టో తయారు చేస్తానని జగన్ అంటున్నారు. పాదయాత్ర ముఖ్యోద్దేశమే అదే అంటూ బయలుదేరారు. పనిలోపనిగా టీడీపీ మేనిఫెస్టో కూడా ఆయనే సెట్ చేస్తారేమో అనే సెటైర్లకు అవకాశం ఇచ్చేలా ఈ వ్యాఖ్యలు ఉంటున్నాయి!