ఐపీఎస్‌లు అనే పదానికి అర్థం మార్చేసి వైపీఎస్‌ల తరహాలో చెలరేగిపోయిన అధికారులకు ఇప్పుడు తాము ఎంత తప్పు చేశామో తెలిసే సమయం వచ్చింది. ప్రభుత్వం మారగానే వారు చేసిన తప్పులన్నీ మీద పడిపోతున్నాయి. ఇప్పటికే జెత్వానీ కేసులో ముగ్గురు ఐపీఎస్‌లు సస్పెండ్ అయ్యారు. రఘురామ కేసులో మరో ఇద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. తర్వాత వివేకా హత్య కేసులో అడ్డగోలుగా వ్యవహరించి సీబీఐకే అడ్డం పడిన వారి సంగతి తేలబోతోంది.
వైఎస్ సునీత ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. వైఎస్ వివేకా హత్య కేసును సీబీఐ విచారిస్తున్న సమయంలో ఐపీఎస్ అధికారులు వ్యవహరించిన తీరుపై ఫిర్యాదు చేశారు. కడప ఎస్పీగా సుదీర్ఘ కాలం పని చేసిన అన్బురాజన్ మరీ గీత దాటిపోయారు. ఆయన సీబీఐకి ఎక్కడికక్కడ అడ్డం పడటంతో పాటు .. సీబీఐతో పాటు సునీత, ఆమె భర్తపై తప్పుడు కేసులు పెట్టించడంలో కీలకంగా వ్యవహరించారు. ఈ క్రమంలో సీబీఐ దర్యాప్తు అధికారి రాంసింగ్ పై కూడా తప్పుడు కేసు పెట్టారు. వీటన్నిటినీ బయటకు తీసి విచారణ చేయించాలని చంద్రబాబును సునీత కోరారు. అలాగే కర్నూలులో సీబీఐ అధికారులకే సహకరించని అప్పటి ఎస్పీపై కూడా చర్యలు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
వైఎస్ వివేకా హత్య కేసులో విచారణ సమయంలో జరిగిన ప్రతి అంశంపై తనకు స్పష్టత ఉందని.. చర్యలు తీసుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ అంశంపై పూర్తి స్థాయిలో ప్రభుత్వ పెద్దలు సమాచార సేకరణ జరిపారు. తప్పుడు పనులు చేసిన ఐపీఎస్‌లపై పూర్తి స్థాయి నివేదికను రెడీ చేశారు. వారు చేసిన తప్పుడు వ్యవహారాలన్నింటినీ ప్రజల్లో పెట్టి.. కేసులు పెట్టి సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నాయి.