నారా లోకేష్ ఇమేజ్ను వైసీపీ సోషల్ మీడియా చాలా దారుణంగా ప్రొజెక్ట్ చేసింది. ఆయన క్లీన్ షేవ్‌ని .. మర్యాదకరమైన మాటతీరుని .. సంప్రదాయమైన డ్రెస్సింగ్ స్టైల్‌ను చూపించి ఆయన మాస్ లీడర్ కాదు పప్పు అని ముద్ర వేయడానికి శాయశక్తులా ప్రయత్నించేది. దానికి తగ్గట్లుగా ఆయన ఇమేజ్ను ప్రజల్లో సాఫ్ట్‌గా పంపేశారు. కానీ ఇప్పుడు అదే వైసీపీ… సోషల్ మీడియా, వైసీపీ ప్రభుత్వం ఆయన ఇమేజ్ను బాగా పెంచేస్తున్నారు. కావాలని చేస్తున్నారో.. వ్యూహాత్మకంగా చేస్తున్నారో లేక అలా జరిగిపోతుందో కానీ లోకేష్‌కు మాత్రం ప్రజల్లో ప్రత్యేకమైన గుర్తింపు వచ్చేలా చేస్తున్నారు.
ఎవరినైనా వదిలేస్తే వారి పని వారు చూసుకుని వస్తారు. కానీ అడ్డుకుంటే రచ్చ అయిపోతుంది. వారికి కావాల్సినంత పబ్లిసిటీ వస్తుంది. రాజకీయాల్లో ఎవరైనా కార్యక్రమాలు సాఫీగా సాగిపోవాలని అనుకోరు. ఏదైనా అడ్డంకి వస్తే జనాల్లో ఎమోషన్ తీసుకొచ్చి విజయతీరం చేరాలని అనుకుంటారు. అలాంటి పరిస్థితులు కల్పించకుండా ప్రభుత్వాలు జాగ్రత్త పడుతూంటాయి. కానీ లోకేష్ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి సర్కార్ వ్యవహరిస్తున్న తీరు భిన్నంగా ఉంది. కొద్దిరోజుల నుంచి ఆయన కార్యక్రమాలకు భారీ ఎలివేషన్ వచ్చేలా చేస్తోంది. నర్సరావుపేట టూర్ ఎపిసోడ్ ఈ విషయంలో పరాకాష్టగా చెప్పుకోవచ్చు. వందల మంది పోలీసులు లోకేష్ కోసం గుమికూడటం ఏమిటి..? లోకేష్ నర్సరాపేటకు వెళ్తే ప్రభుత్వం పునాదులు కదిలిపోతాయన్నంతగా కంగారు పడటం ఏమిటి..?
లోకేష్ చేస్తున్న రాజకీయ పర్యటనలు.. ఆయన స్టేట్మెంట్లు .. సోషల్ మీడియాలో లోకేష్‌ను ఫైటర్‌గా చూపించేందుకు టీడీపీ చేస్తున్న ప్రయత్నాలకు .. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బాగా సహకరిస్తోంది. అవసరం లేని చోట ఆయనను అడ్డుకుని పబ్లిసిటీ కల్పిస్తోంది. గతంలో టీడీపీ నేతలు చెప్పినట్లుగా సెప్టెంబర్‌లో లోకేష్‌ను అరెస్ట్ చేస్తారన్న ప్లాన్‌లో ప్రభుత్వం ఉంటే.. ఇక లోకేష్ నాయకత్వానికి టీడీపీలో తిరుగు ఉండదని అనుకోవచ్చు. ఎలా అయినా లోకేష్ ఇమేజ్ను పప్పుగా ముద్రించిన వారే ఇప్పుడు ఆయన ఇమేజ్ను అమాంతం పెంచే ప్రయత్నంలో భాగం కావడం యాధృచ్చికమో.. వ్యూహాత్మక తప్పిదమో కానీ.. లోకేష్ పంట మాత్రం పండుతోంది.