ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అగ్రిగోల్జ్ బాధితుల విషయంలో వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదమవుతోంది. గత ఎన్నికల సమయంలో.. అగ్రిగోల్డ్ బాధితులతో ప్రత్యేకంగా సమావేశాలు పెట్టడమే కాదు.. జగన్మోహన్ రెడ్డి దాదాపుగా ప్రతి చోటా.. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి బడ్జెట్లో రూ. 1150 కోట్లు కేటాయించి.. అందరికీ పంపిణీ చేస్తామని ప్రకటించారు. మొదటి బడ్జెట్ వచ్చింది. అందులో రూ. 1150 కోట్లు కేటాయించారు. నిన్న రెండో బడ్జెట్ కూడా పెట్టారు. అందులో రూ. 200కోట్లు కేటాయించారు. అయితే.. మొదటి బడ్జెట్లో కేటాయించిన రూ. 1150 కోట్లు పంచారా అంటే.. కేవలం రూ. 264 కోట్లు మాత్రమే పంచారు.
అదీ కూడా.. అంతకు ముందు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్ధం చేసి ..అగ్రిగోల్డ్ ఆస్తుల్ని వేలం వేసి సిద్ధం చేసిన పెట్టిన సొమ్ము అది. అంతే కానీ అదనంగా.. ఒక్కటంటే.. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. పోనీ ఆ సొమ్ము ఈ ఏడాది అయినా ఇస్తారు అనుకుంటే.. ఈ సారి కనీసం కేటాయింపులు కూడా చేయలేదు. కేవలం రూ. రెండువందల కోట్లు మాత్రమే కేటాయించారు. ఎప్పుడు ఇస్తారో తెలీని పరిస్థితి. ఏపీ సర్కార్ తనను ఘోరంగా మోసం చేసిందని.. భావిస్తున్న అగ్రిగోల్డ్ బాధితులు…కమ్యూనిస్టు పార్టీ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఉద్యమానికి సిద్ధమయ్యారు. చలో అసెంబ్లీకి వెళ్లాలనుకున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హౌస్ అరెస్ట్ చేశారు.. బయటకు వెళ్లనీయలేదు.
కోర్టు పరిధిలో ఉన్న ఆస్తులను వీలైనంత వేగంగా అమ్మేసి.. అందరికీ పంచాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. కోర్టు కూడా అమ్మేందుకు అనుమతులు ఇచ్చింది. కానీ అమ్మకం మాత్రం ఆగిపోయింది. ఇళ్ల స్థలాల పంపిణీ కోసం వైసీపీ నేతలు.. వారి బినామీల దగ్గర.. అత్యధిక ధరకు భూములు కొంటున్నారని.. అగ్రిగోల్డ్ భూములు కొని అందరికీ సాయం చేయాలన్న డిమాండ్లు బాధితుల నుంచి వినిపిస్తున్నాయి. కానీ ప్రభుత్వంలో మాత్రం చలనం లేదు. అగ్రిగోల్డ్‌కు కేటాయించినవీ ఇవ్వలేదు. అడిగితే.. అరెస్టులు చేస్తున్నారు.