జగన్ రెడ్డి అప్పుడే అలసిపోయారు. ఆయన బయటకు రాకుండా క్యాడర్ ను రోడ్డెక్కించాలని చేసిన ప్రయత్నాలు ఫలించకపోతూండటంతో కొంత కాలం ఆగాలని నిర్ణయించుకున్నారు. ఫీజు రీఎంబర్స్ మెంట్ సహా ప్రకటించిన ఇతర నిరసనల్ని వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు. వైసీపీ ఈ విషయం ప్రకటించినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎందుకంటే వారు నిరసనలు చేస్తున్న విషయం చాలా మంది ఆ పార్టీ క్యాడర్ కూ తెలియదు. వారు పట్టించుకోవడంలేదు.
విద్యుత్ చార్జీల పెంపుపై గత వారం వైసీపీ నిరసనలు నిర్వహించింది. చిలుకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజనీ ర్యాలీ నిర్వహించారు. ఆమె తన నియోజకవర్గం క్యాడర్ మొత్తానికి సందేశాలు పంపారు. చివరికి కార్యక్రమం ప్రారంభించాలని అనుకునే సరికి.. ఓ వంద మంది కూడా బైకులతో రాలేదు. వాళ్లకు పెట్రోల్ కొట్టించి ఏదో ర్యాలీ చేయించామని అనిపించారు.. ఈ పరిస్థితి ఒక్క చిలుకలూరిపేటలోనే కాదు అన్ని చోట్లా ఉంది. కనీసం వంద నియోజకవర్గాల్లో అసలు ఎవరూ పట్టించుకోలేదు.
కరెంట్ బిల్లుల్ని పెంచింది వైసీపీనే అని జనం నమ్మడం వల్లనే ఎక్కువ మంది రావడం లేదని ఓ నిర్ణయానికి వచ్చారు. అదే సమయంలో జనవరిలో ఫీజు రీఎంబర్స్మెంట్ పై పోరాటం చేయాలని అనుకున్నారు. కానీ గత నిరసనలు చూసి ఆపేయడం బెటర్ అనుకున్నారు. ఆ విషయాన్ని ప్రకటించారు. ఫీజు రీఎంబర్స్ మెంట్ బకాయిలన్నీ వైసీపీ హయాంలోనివే. ఆధారాలతో సహా బయటపెడితే పరువు పోతుంది. అందుకే ఊరుకున్నంత ఉత్తమం ఉండదని వైసీపీ అనుకుంది.
జగన్ రెడ్డి చేసిన పాలనా నిర్వాకాలను ప్రజలు అంత తేలికగా మర్చిపోయేలా అవకాశం ఉండదు. ప్రజల్లో వ్యతిరేకత తగ్గేలా చేసుకునేందుకు ముందు వైసీపీ ఏదో ఓ ప్లాన్ చేసుకుని కార్యాచరణ అమలు చేయాల్సి ఉంది. లేకపోతే పరిస్థితి మారే చాన్స్ లేదు. జగన్ జిల్లాల పర్యటన కూడా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి.