ఏ రాజకీయ పార్టీ అయినా.. ఇతర పార్టీల నేతలకు లేని క్రెడిట్ ఆపాదిస్తోందంటే.. ఏదే మతలబు ఉన్నట్లే…! ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు పని గట్టుకుని మరీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని పొగిడేస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో… క్రెడిట్ మొత్తం వైఎస్ఆర్ కే కట్టబెట్టడానికి బీజేపీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. నిన్న సోము వీర్రాజు.. పోలవరం ప్రాజెక్ట్ ఘనత మొత్తం వైఎస్ రాజశేఖర్ రెడ్డిదేనని సర్టిఫికెట్ జారీ చేసేశారు. ఈ రోజు ఆ బాధ్యత ఎమ్మెల్సీ మాధవ్ తీసుకున్నారు. పోలవరం కోసం ఎంతో కొంత చేసిన ఏకైక నాయకుడు వైఎస్ మాత్రమేనని.. పోలవరం ప్రాజెక్టును ఎన్నడూ టీడీపీ మ్యానిఫెస్టోలో చేర్చలేదని ..మరో సర్టిఫికెట్ జారీ చేసేశారు. నిన్నామొన్నటి వరకూ.. పోలవరం ప్రాజెక్ట్ మొత్తం తమ ఘనతని.. వంద శాతం నిధులు ఇస్తున్నామని చెప్పుకొచ్చిన బీజేపీ నేతలు ఇప్పుడీ క్రెడిట్ ను వైఎస్ ఖాతాలో వేయడానికి ఉత్సాహ పడటానికి లోతైన కారణమే ఉందని చెబుతున్నారు.
ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఏపీలో రాజకీయ పరిస్థితులు మారిపోతున్నాయనడానికి… బీజేపీ నేతలు .. వైఎస్ ను పోటీ పడి పొగడటానికి ప్రాధాన్యం ఇవ్వడమే సాక్ష్యంగా చెప్పుకోవచ్చు. ఓ వైపు ఢిల్లీలో ఏపీ బీజేపీ వ్యవహారానలు చూస్తున్న రామ్ మాధవ్.. వచ్చే ఎన్నికల్లో దక్షిణాది నుంచి తమకు కొత్త పార్టీలతో పొత్తులు ఉంటాయని చెబుతున్న సమయంలోనే.. ఇక్కడ బీజేపీ నేతలు.. వైఎస్ ను పొగడటం ప్రారంభించారు. అంటే ఈ రెండు పార్టీల మధ్య … పొత్తుల కోసం అవసరమైన వాతావరణాన్ని.. ఇలాంటి ప్రకటనల ద్వారా ఏర్పాటు చేసుకుంటున్నారన్న అభిప్రాయం ఏర్పడుతోంది. అంతా రామ్ మాధవ్ సూచనల ప్రకారమే జరుగుతోందన్న అభిప్రాయం ఏపీ రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది. నిజానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయి పదేళ్లవుతోంది. అంతకు ముందు ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో జలయజ్ఞం చేశారు. కానీ.. పోలవరం ప్రధాన ప్రాజెక్ట్ దగ్గర ఒక్క శాతం పనులు కూడా కాలేదు. కాలువలు తవవ్వించి కమిషన్లు పొందారని.. టీడీపీ నేతలు ఆరోపిస్తూంటారు. పోలవరం విద్యుత్ కేంద్రం జగన్ కు దక్కలేదని అప్పట్లో పనులు ప్రీక్లోజ్ చేశారని దేవినేని ఉమ ఆ మధ్య కొన్ని డాక్యుమెంట్లు కూడా బయటపెట్టారు. ఇవన్నీ బీజేపీ నేతలకు తెలియనివి కావు. అయినప్పటికీ..పొత్తు కోసం వైఎస్ కు క్రెడిట్ ఇచ్చేందుకు ఆరాటపడుతున్నారు.
నిజానికి బీజేపీ – వైసీపీ మధ్య సుహృద్భావ సంబంధాలే ఉన్నాయి. అయితే.. బీజేపీపై ఉన్న తీవ్రమైన ప్రజా వ్యతిరేకత కారణంగా.. ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే… రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నట్లే అన్న అభిప్రాయం వైసీపీలో ఉంది. కానీ బీజేపీ ఒత్తిడి చేస్తే.. పెట్టుకోక తప్పని పరిస్థితి ఉంది. రెండు నెలల్లో ఎన్నికల ప్రకటన రావడం ఖాయమని తేలడంతో ఢిల్లీలో బీజేపీ వ్యూహకర్తలు వేగంగా వ్యూహాలు అమలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ వైఎస్ ను మోస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.