ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు కడప ఉక్కు పరిశ్రమ .. ప్రత్యేకహోదాలా సెంటిమెంట్‌గా మారింది. ఏ ముహుర్తాన.. కేంద్రం.. సుప్రీంకోర్టులో ఉక్కు ఫ్యాక్టరీ అసాధ్యం అని అఫిడవిట్ దాఖలు చేసిందో కానీ అప్పట్నుంచి ఏపీలో రాజకీయం రాజుకుంది. తెలుగుదేశం పార్టీ దూకుడుగా వెళ్తోంది. ఉన్న పళంగా.. ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆమరణదీక్షకు కూర్చున్నారు. నేటితో వారి దీక్ష ప్రారంభమై ఏడు రోజులయింది. వారి ఆరోగ్యంపై గంట గంటకు వస్తున్న బ్రేకింగ్‌లు ప్రజల్లో మరింత సెంటిమెంట్ పెంచుతున్నాయి. దీన్ని రాజకీయంగా ఉపయోగించుకోడానికి టీడీపీ దగ్గర కావాల్సినంత సరుకు ఉంటుంది. కానీ ఈ పోరాటంలో వైసీపీ ఎక్కడ ఉంది..?
నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది ప్రత్యేకహోదాను మించిన సంక్లిష్టమైన పరిస్థితి. ఎందుకంటే… కడప జిల్లా వైసీపీకి కంచుకోట. దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి అండగా ఉంటున్న జిల్లా. ఆ జిల్లా ప్రయోజనాలను ఎప్పటికప్పుడు కాపాడాల్సిన బాధ్యత కూడా ఉంది. కానీ ఉక్కు పరిశ్రమ ప్రస్తావనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకురావడం లేదు. పాదాయత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నీ మాట్లాడుతున్నారు కానీ.. ఉక్కు పరిశ్రమపై నోరు మెదపడం లేదు. ఓ వైపు కడప నడిబొడ్డున తెలుగుదేశం పార్టీ తొడ కొడుతోంది. టీడీపీ నేతలు చేస్తున్నవి దొంగ దీక్షలని..మరొకటని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు కానీ.. మరి ఉక్కు పరిశ్రమ కోసం.. మీరేం చేస్తున్నారు అన్న ప్రశ్న వస్తే నీళ్లు నమలాల్సిన పరిస్థితి. ఇప్పటికే బీజేపీతో కుమ్మక్కయి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టేశారన్న విమర్శలు జోరుగానే ఉన్నాయి. ఇప్పుడు సొంత జిల్లాకు రావాల్సిన స్టీల్ ఫ్యాక్టరీ విషయంలోనూ .. కేంద్రం తీరుపై ఒక్క మాట మాట్లాడలేకపోవడం.. వైసీపీ శ్రేణులకు ఇబ్బందికరంగా మారింది.
ఉక్కుఫ్యాక్టరీ విషయంలో టీడీపీ మైలేజ్ సంపాదిస్తోందనే సూచనలు రావడంతో… వైసీపీ హడావుడిగా… కడప జిల్లాల్లోని నియోజకవర్గాల్లో సభలు నిర్వహించడం ప్రారంభించింది. నిజానికి సీఎం రమేష్ ఉక్కుదీక్ష ప్రారంభానికి ముందు రోజే… ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి 48గంటల దీక్ష ప్రారభించారు. కానీ దాన్ని ఎవరూ పట్టించుకోలేదు. సీఎం రమేష్ దీక్ష వారం రోజులుగా సాగుతూండటం.. ఇప్పుడిప్పుడే.. వేడి పెరుగుతూండటంతో.. కనీసం తాము కూడా.. పోరాడుతున్నామని చెప్పుకునేందుకు వైసీపీ సభలు నిర్వహిస్తోంది. అయితే ఆ సభల్లో.. తెలుగుదేశం పార్టీని విమర్శించడానికే సమయం వెచ్చిస్తోంది. రాజంపేటలో… స్టీల్ ఫ్యాక్టరీ డిమాండ్‌ను వినిపించేందుకంటూ సభను పెట్టిన… వైసీపీ నేతలు… టీడీపీపై విమర్శల వర్షం కురిపించారు. ఢిల్లీలో ధర్నాలు చేయాలి కానీ… కడపలో చేస్తారా అని ప్రశ్నించారు. వారు కూడా కడపలోనే సభ పెట్టి.. ఈ విమర్శ చేయడం ఆ పార్టీ అవగాహనా లోపానికి సాక్ష్యంగా నిలిచింది.
మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ… బీజేపీని నేరుగా విమర్శించలేనంత అసహాయతలో ఉంది. వారి పరిస్థితిని సంప్రదాయ ఓటర్లు అయినా గుర్తించారు… వారి స్థాయిలో వారు పోరాడుతున్నారని సమర్థించేవారు. కానీ ఇప్పుడు.. వారి అసహాయతే.. ప్రతీ దానికి అడ్డం పడుతూండటం.. తెలుగుదేశం పార్టీ దీన్ని కావాల్సినంతగా ఎక్స్పోజ్ చేస్తూండటంతో.. వైసీపీ ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతోంది.