మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి… వైకాపాలో కీలక నేతలు. ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు, ఇంకా చెప్పాలంటే వారు బంధువులు కూడా! ఈ ఇద్దరు ప్రకాశం జిల్లా రాజకీయాల్లో కీలకంగా నిలుస్తూ వచ్చారు. ప్రస్తుతం జగన్ పాదయాత్ర చేస్తున్నారు, ఇంకోపక్క వచ్చే ఎన్నికలకు సమయం కూడా ముంచుకొస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి టిక్కెట్ల ఆశావహుల తాకిడి సహజంగానే పార్టీలో పెరుగుతుంది. మరోవైపు పాదయాత్రలో భాగంగా ఓ ఇద్దర్ని ‘వైకాపా అభ్యర్థులు వీరే’ అంటూ జగన్ ప్రకటించేసిన సంగతీ తెలిసిందే. అయితే, దీనికి పూర్తి భిన్నమైన పరిస్థితి ప్రకాశం జిల్లాలో ఉందనే చర్చ వైకాపా వర్గాల్లో వినిపిస్తోంది! 2014 ఎన్నికల్లో వైకాపా పరిపూర్ణ ఆధిక్యత ప్రదర్శించిన ఈ జిల్లాలో.. వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి వేరేలా మారుతుందేమో అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
సహజంగా, నియోజక వర్గ ఇన్ ఛార్జులుగా పనిచేస్తున్నవారే ఎమ్మెల్యే టిక్కెట్లు ఆశిస్తారు కదా! కానీ, దర్శి నియోజక వర్గం ఇన్ ఛార్జ్ గా ఉన్న శివప్రసాద్ తోపాటు, ఆయన కుమారుడు కూడా ఈ మధ్య ఓ నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. అదేంటంటే.. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్ తాము ఆశించడం లేదనీ, ఆ బరిలో ఉండబోమని పార్టీ అధినాయకత్వానికి చెప్పారట! అంతేకాదు, ఆ నియోజక వర్గంలో పార్టీ కార్యకర్తలకు కూడా ఇదే విషయాన్ని బహిరంగంగానే చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ఇదొక్కటే కాదు, పర్చూరు నియోజక వర్గంలోనూ ఇదే సీన్. ఆ నియోజక ఇన్ ఛార్జ్ గా వ్యవహరిస్తున్న భరత్ కూడా తనకు ఎమ్మెల్యే టిక్కెట్ అవసరం లేదనీ, ఎన్నికలకు దూరంగా ఉంటానని ప్రకటించేశారట! అయితే, వీరు ఉన్నపళంగా పార్టీని విడిచిపెట్టి బయటకి వెళ్లిపోతామని అనడం లేదట. జగన్ నాయకత్వంలో పనిచేస్తాం, కానీ ఎన్నికల బరిలో మాత్రం ఉండబోమని స్పష్టం చేయడమే ఇప్పుడు చర్చనీయంగా మారుతోంది. వీరి నిర్ణయాలు జిల్లాలోని ఇతర నియోజక వర్గాల ఆశావహులను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తాయనడంలో సందేహం లేదు.
ఇంతకీ ఈ పరిస్థితి ఎందుకు వస్తోందంటే… పార్టీలో పెరుగుతున్న అంతర్గత కుమ్ములాటలే అని అభిప్రాయం వినిపిస్తోంది. నియోజక వర్గ స్థాయిలో పనిచేస్తున్నవారికి జిల్లా నాయకత్వం నుంచిగానీ, రాష్ట్ర నాయకత్వం నుంచి సరైన ప్రాధాన్యత దక్కడం లేదన్న అసంతృప్తి ఉందని చెప్పుకుంటున్నారు. అంతేకాదు.. అసలు సమస్య బాలినేని, సుబ్బారెడ్డి మధ్యనే ఉందని కొంతమంది అంటున్నారు! వారి మధ్య సమయన్వం లోపం ఉందనీ, దీంతో పార్టీలో రెండు గ్రూపులు ఏర్పడ్డాయనీ, జిల్లాపై పట్టు కోసం ఇద్దరూ పోటీ పడుతూ ఉండటంతోనే పరిస్థితి ఇలా మారిందని మరికొందరు చెబుతున్నారు. అలాగని, ఈ ఇద్దరూ నిత్యమూ జిల్లాలో అందరికీ అందుబాటులో ఉండరనీ, వ్యాపార వ్యవహారాల పేరుతో ఎక్కువగా హైదరాబాద్ లో నే గడుపుతూ ఉంటారనే అభిప్రాయం ఆ పార్టీ వర్గాల్లోనే వినిపిస్తోంది. దీంతో జిల్లా పార్టీ కేడర్ లో కొంత గందరగోళం ఏర్పడిందనీ, ఆ ఇద్దరి మధ్యా తమకెందుకీ తలనొప్పి అనుకునేవారు ఇప్పట్నుంచే ఎన్నికలకు దూరంగా ఉంటామని ప్రకటిస్తున్నారని తెలుస్తోంది. ఈ విషయం జగన్ వరకూ వెళ్లిందని సమాచారం. మరి, దీనిపై జగన్ స్పందన ఎలా ఉంటుందో చూడాలి.