చంద్రగిరి నియోజకవర్గం విషయంలో.. ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం.. అత్యంత వ్యూహాత్మకంగానే ఉన్నట్లుగా కనిపిస్తోంది. చివరి విడత పోలింగ్‌కు మూడు రోజుల ముందు.. అనూహ్యమైన ప్రకటన రాగా.. అలాంటిదేదో వస్తుందని.. తెలుసుకున్న వైసీపీ నేతలు అంతే వ్యూహాత్మకంగా… పోల్ మేనేజ్ మెంట్.. అంటే.. డబ్బుల పంపిణీ పూర్తి చేసేశారు. రీపోలింగ్ పై బీజేపీకి సన్నిహితంగా ఉంటున్న వైసీపీకి చెందిన అభ్యర్థి ఫిర్యాదు చేయడం.. వెంటనే సీఎస్ లేఖ రాయడం..దాని ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం.. చకచకా జరిగిపోయాయి. ఇలా రాత్రి నిర్ణయం వస్తే.. తెల్లవారే సరికి.. ఐదు పోలింగ్ బూత్‌ల పరిధిలో.. .వైసీపీ నేతలు డబ్బులు పంపిణీ చేసేశారు. ఓటుకు మూడు వేలు చొప్పున ఇచ్చేశారు. విషయం తెలిసి పోలీసులు వెళ్లేసరికి పని పూర్తయింది. కేసులు నమోదు చేసుకోవడం తప్ప చేయగలిగిందేమీ లేదు.
ఆ పోలింగ్ బూత్‌లన్నీ.. టీడీపీకి ఏకపక్షంగా ఓట్లు వేసే గ్రామాల్లోనివి కావడంతో… పోలింగ్ సరళి లెక్కలేసుకుని.. గెలుపు కోసం… రీపోలింగ్ కుట్ర పన్నారని టీడీపీ నేతలంటున్నారు. కచ్చితంగా టీడీపీకి పడే ఓట్లను.. రీపోలింగ్ ద్వారా కొనుగోలు చేసే వ్యూహాన్ని ఈసీ ద్వారా అమలు చేస్తున్నారని అంటున్నారు. రీ పోలింగ్ నిర్వహణలో.. ఎక్కడా.. ఈసీ సంప్రదాయాలు పాటించలేదు. పోలింగ్ తీరుపై ప్రిసైడింగ్ ఆఫీసర్లు కానీ.. రిటర్నింగ్ ఆఫీసర్లు కానీ ఫిర్యాదు చేయలేదు. కానీ వైసీపీ అభ్యర్థికి అవసరం కాబట్టి.. దానికి అనుగుణంగా నివేదికలు తెప్పించుకుని.. రీపోలింగ్ కు ఆదేశించేశారు. అదే సమయంలో టీడీపీ అభ్యర్థి చేసిన ఆరోపణలపై కనీసం.. వివరణ కూడా.. సంబంధిత అధికారుల్ని కోరలేదు. దీనిపై.. టీడీపీ నేతలు ఢిల్లీకి వెళ్లి సీఈసీకి ఫిర్యాదు చేశారు.
పోలింగ్ ముగిసిన నెల రోజుల తరవాత రీపోలింగ్ పెట్టడం ఏమిటని ప్రశ్నించారు వారికి అక్కడ సమాధానం రాలేదు. మరో వైపు.. కొంత మంది టీడీపీ నేతలు… ఇన్చార్జ్ సీఈవోను కలిసి.. చంద్రగిరిలో మరికొన్ని చోట్ల పోలింగ్ పెట్టాలని.. డిమాండ్ చేశారు. అక్రమాలు జరిగాయని ఆధారాలు సమర్పించారు. కానీ వారికి ఎలాంటి హామీ రాలేదు. ఇప్పటికే ఏపీలో వివాదాస్పద నిర్ణయాలతో… ఈసీ అభాసుపాలవుతూంటే.. ఇలాంటి నిర్ణయం రాబోతోందని.. తెలిసి.. తప్పించుకోవడానికే.. ద్వివేదీ సెలవులో వెళ్లారన్న చర్చ ఇప్పుడు టీడీపీలో నడుస్తోంది.