ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మరోసారి విమర్శలు చేశారు ప్రతిపక్ష నేత జగన్. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో పోరాటం అని సీఎం అంటున్నారనీ, మరోపక్క కేంద్రంతో చీకట్లో మంతనాలు జరుపుతున్నారని ఆరోపించారు. ప్రజలను మభ్యపెట్టడం కోసమే ఈనెల 30న తిరుపతిలో చంద్రబాబు సభ పెడుతున్నారు అన్నారు. ప్రజలను భాజపా మోసం చేసిందని సభ పెడతారట, ఆ మోసంలో చంద్రబాబు కూడా భాగస్వామి కాదా అంటూ ప్రశ్నించారు. గాంధీని చంపేసి, ఆ తరువాత దానికి నిరసనగా గాడ్సే దీక్ష చేస్తున్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు.
మూల విరాట్ నరేంద్ర మోడీ కాళ్లు ఈ మధ్య చంద్రబాబుకు దొరకడం లేదనీ, కాబట్టి గవర్నర్ నరసింహన్ కాళ్లు పట్టుకుంటున్నారని ఆరోపించారు. గవర్నర్ తో సుజనా చౌదరి కలిశారనీ, ఐబీ ఛీఫ్ తో చంద్రబాబు మాట్లాడారని అన్నారు. విజయవాడలో గవర్నర్ తో చంద్రబాబు మాట్లాడరట, కేంద్రంతో పోరాటం వద్దని గవర్నర్ ఆయనకి చెప్పారని ఎల్లో మీడియా రాస్తే నమ్మాలట అంటూ ఎద్దేవా చేశారు. ఏటీఎమ్ లలో డబ్బులు లేకపోవడానికి కారణం.. చంద్రబాబే అనీ, ఆయనే దోచేసుకుని విదేశాలకు పంపించారని ఆరోపించారు. ఇక, ఇతర అంశాలపై విమర్శలూ ఆరోపణలూ షరామామూలే.
గవర్నర్ దగ్గరకి చంద్రబాబు వెళ్తే… సరే, భయపడి వెళ్లారని ఆరోపించుకోవచ్చు! కానీ, గవర్నర్ విజయవాడకు వచ్చిన సంగతి జగన్ కు అర్థం కాలేదేమో..! గంటన్నరపాటు సాగిన ఆ సమావేశం ఏంటనేది జగన్ కి తెలిస్తే చెప్పొచ్చు కదా! గవర్నర్ తో సుజనా ఎందుకు భేటీ అయ్యారో అది కూడా చెబితే బాగుండేది. వైకాపా ద్వంద్వ ప్రమాణాలు ఎలా ఉన్నాయంటే… ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎన్నిసార్లు ప్రధానమంత్రి కార్యాలయం చుట్టూ తిరిగినా తప్పులేదు! ఎందుకంటే, రాష్ట్రంలో అవినీతిపై ఫిర్యాదులకు వెళ్లామని చెప్పారు. అక్కడ జరిగిన కాళ్ల బేరమేంటో ప్రజలకు తెలియంది కాదు. ఇప్పుడు గవర్నర్ వచ్చి ముఖ్యమంత్రిని కలిస్తే… ప్రధాని కాళ్లు దొరక్కే నరసింహన్ దగ్గరకి సీఎం వెళ్లారంటారు! వారు పి.ఎమ్.ఒ.కి ఎన్నిసార్లు వెళ్లినా అది రాష్ట్ర ప్రయోజన కార్యక్రమం, గవర్నర్ వచ్చి సీఎంతో భేటీ అయితే ఇది కాళ్ల బేరం! కేంద్రంపై అవిశ్వాసం పెట్టి, ప్రధానితో మంతనాలు జరిపిందెవరు..? కేంద్రంపై పోరాటం అంటూ కేవలం టీడీపీపై మాత్రమే విరుచుపడే వైకాపా వైఖరిని ఏమంటారు..? ఈ క్రమంలో మోడీ కరుణా కటాక్ష వీక్షణాల కోసం వెంపర్లాడిందెవరో ప్రజలకు తెలీదా..?