ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరాజయం వైసీపీలో చిచ్చు పెట్టే అవకాశం కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ తమకు సాంకేతికంగా ఉన్న 23 ఓట్ల వరకే టార్గెట్ పెట్టుకోవడంతో ఆ మేరకు క్రాస్ ఓటింగ్ జరిగిందని లేకపోతే ఇంకా చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారన్న అభిప్రాయాన్ని టీడీపీ నేతలు పంపారు. ఇది మైండ్ గేమ్ కోసం చేసిన ప్రకటనో కాదో కానీ ఎన్నికల ఫలితాల తర్వాత మాత్రం ఆ పార్టీలో ఓ రకమైన అనుమాన పరిస్థితి నెలకొంది. ఏ ఒక్క ఎమ్మెల్యేనూ నమ్మలేనట్లుగా పరిస్థితి మారింది.
ముందుగా టీడీపీతో టచ్‌లో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతున్న పదహారు మంది ఎమ్మెల్యేలపై వైసీపీ హైకమాండ్ దృష్టి సారించిందంటున్నారు. నిజానికి ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలోనే ఇంటలిజెన్స్‌తో నిఘా పెట్టించినప్పుడే పలువురు ఎమ్మెల్యేలు అసంతృప్తికి గురయ్యారు. ఇప్పుడు తాము ఓటు వేసినా టీడీపీ నేతల్ని అన్న మాటల్ని పట్టుకుని తమను అవమానిస్తే.. పార్టీ నష్టమని ఆ ఎమ్మెల్యేలు అంటున్నారు. అయితే వైసీపీ అగ్రనేత రాజకీయం వేరుగా ఉంటుంది. తనకు నష్టం జరిగినా సరే… ఇతరుల్ని టార్గెట్ చేయాలనుకుంటారు. అది సొంత పార్టీ వారైనా ఆయన వదలరు. ఇప్పుడు అదే పరిస్థితి కనిపిస్తోందని ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు.
కారణం ఏదైనా టీడీపీ ట్రాప్‌లో పడి ఎమ్మెల్యేల్ని దూరం చేసుకుంటే మొదటికే మోసం వస్తుందని పలువురు సీనియర్ నేతలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత రాజకీయాల్లో ముఖ్యంగా వైసీపీలో అగ్రనేత ప్రయోజనాల కోసం ప్రతి ఒక్కర్నీ బలి చేస్తారని ఇలాంటి పార్టీలో ఉండాలంటే… వారికి ఎంతో నమ్మకం కలిగించాల్సి ఉంటుందన్నారు. అలా కాకుండా అందర్నీ అనుమానించి .. అవమానపరిస్తే….. మొదటికే మోసం వస్తుందని అంటున్నారు. మొత్తానికి వైసీపీలో అనుమాన ముసలం అయితే అంటుకుంది. దాన్ని పెంచుకుని పార్టీ మొత్తానికి అంటించుకుంటారో… సొంత నేతల్ని నమ్మి.. ఆర్పేసుకుంటారో జగన్ చేతుల్లోనే ఉంది.