హీరోయిన్ జెత్వానీ కేసు తప్పుడుది అంటూ.. సాక్షి పత్రిక, వైసీపీ నేతలు చెలరేగిపోతున్నారు. ఎలా తప్పుడుదో చెప్పడం లేదు. చంద్రబాబును అరెస్టు చేశారనే ఐపీఎస్‌లపై కక్ష అని కూడా పుంఖానుపుంఖాలుగా రాస్తున్నారు. చంద్రబాబును అరెస్టు చేసింది కొల్లి రఘురామిరెడ్డి. ఆయనకు ఇవ్వాల్సిన కొల్లేటరల్ ట్రీట్మెంట్ రెడీ అవుతోంది.. అందులో మొహమటమేమీ లేదని టీడీపీ నేతలు బహిరంగంగా చెబుతున్నారు. మరి వీరేం చేశారు ?. మాఫియాలాగా మారి.. జగన్ రెడ్డి కోసం బరి తెగించిన ఈ ఐపీఎస్‌లను తమకు చుట్టుకునే చాన్స్ లేకపోతే ఎప్పుడో వదిలేసేవారు. కానీ ఆ కేసు ఎటూ తిరిగి తాడేపల్లి ప్యాలెస్ కు వస్తుంది కాబట్టే.. అక్రమ కేసు అని పెడబొబ్బలు పెడుతున్నారు.
హీరోయిన్ జెత్వానీ కేసులో అది అక్రమ కేసు ఎలా అవుతుందో ముందు చెప్పాల్సి ఉంది. అసలు తప్పుడు ఫోర్జరీ డాక్యుమెంట్ సృష్టించి మరీ ఆమెపై తప్పుడు కేసు పెట్టి ముంబై నుంచి తీసుకు వచ్చి వేధించిన వ్యవహారం సాక్ష్యాలతో కళ్ల ముందు ఉంది. మరి తప్పుడు కేసు ఎలా అవుతుంది.. ?. తమకు అధికారం ఉందని ఇలా.. ఓ మహిళని .. ఆమె కుటుంబాన్ని కిడ్నాప్ చేసి తీసుకు వచ్చేస్తారా ?. అలా చేయడమే కాకుండా… ఇప్పుడా మహిళపై అసత్య ప్రచారం చేస్తున్నారు. హనీ ట్రాప్ అంటున్నారు. అదే నిజమైతే… ఆ హనీట్రాప్ కు గురైన వాళ్లు ఫిర్యాదు చేయాలి కదా !. తనపై ఎక్కడా కేసుల్లేవని జెత్వానీ చెబుతున్నారు. కానీ ఆమెపై చేస్తున్న తప్పుడు ప్రచారాలకు మాత్రం హద్దే లేకుండా పోతోంది.
దీనికి కారణం ఆ కేసు నేరుగా సజ్జల రామకృష్ణారెడ్డి, అప్పటి సీఎంవోలో చక్రం తిప్పిన ఐఏఎస్ అధికారి, జగన్ రెడ్డి వద్దకు వెళ్తోంది. ముగ్గురు ఐపీఎస్‌లకు ఆమెను అక్రమంగా అరెస్ట్ చేయాల్సిన పని లేదు. వారిని సీఎంవోకు పిలిచి మరీ ప్రణాళికలు వేసి అరెస్ట్ చేయించింది సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయన ఎందుకు ఇలా చేశారంటే.. జగన్ రెడ్డి కోసం. సజ్జన్ జిందాల్ ను కాపాడేందుకు ప్రజలు తనకు ఇచ్చిన అధికారాన్ని క్రిమినల్ మైండ్ తో .. పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేశారు. అడ్డంగా దొరికిపోయారు. ఇప్పుడు కిందా మీదా పడుతున్నారు.
ఈ కేసులో రేపోమాపో సజ్జలను అదుపులోకి తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయం తెలిసే ఆయన మొదటి నుంచి తనకేం తెలియదని హడావుడి చేయాలని చూశారు. కానీ సాంకేతిక ఆధారాలన్నీ వెలికి తీశారు. అడ్డంగా దొరికిపోయారు. ఇప్పుడు … ఆ మహిళపై ఎన్ని నిందలేసినా తప్పించుకోలేరు.